రోజాగారి బెంగ తీరాలంటే అదొక్కటే మార్గం
వైసీపీలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎంత యాక్టివ్ పొలిటీషియనో అందరికీ తెలుసు. పాయింట్ ఏదైనా ప్రత్యర్థుల మీద విరుచుకుపడటంలో రోజాగారికి ఉన్నంత చాకచక్యం ఎవరికీ ఉండదు. అందుకే పార్టీలో ఆమెకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. వైసీపీ గెలిచిన వెంటనే రోజాకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా రోజాకు పదవి దక్కలేదు. చిత్తూరు నుండి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కె.నారయణస్వామికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతో జిల్లాలో ప్రాబల్యం ఉండాలంటే మంత్రి పదవి కావాల్సిందేనని రోజా పట్టుబట్టారు.
కానీ వీలు లేకపోవడంతో వైఎస్ జగన్ హామీ మీద రోజా ఏపీఐఐసీ చైర్మన్ పదవి తీసుకుని సర్దుకున్నారు. అన్నీ కుదిరితే ఆమెకు మొదటి రెండున్నర ఏళ్లలోనే మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే టాక్ వచ్చింది. ఇంతలోనే సొంత పార్టీలో రోజాకు వ్యతిరేక వర్గం తయారైందని వార్తలు గుప్పుమన్నాయి. రోజా సైతం ఒకానొక సందర్భంలో సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయని ఆమె వాపోయారు. ఇక తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి నిన్న నగరిలో పర్యటించడం, ఈ విషయం గురించి రోజాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం మరోసారి ఆమెకు అసహనం తెప్పించాయి.
బయటికి చెప్పకపోయినా జిల్లాలో తన ప్రాభల్యం తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ఇవన్నీ చేస్తున్నారని సన్నిహితుల వద్ద గోడు చెప్పుకున్నారట రోజా. డిప్యూటీ సీఎం సైతం నగరిలో పర్యటించడానికి తనకు ఎవరి అనుమతీ అక్కర్లేదని ఆయన అనడంతో ఇష్యూ మరింత సీరియస్ అయింది. పార్టీలో మంచి బలం ఉన్న ఒక నాయకుడి అండతోనే ఈ సామాజిక వర్గ విభేదాలు నడుస్తున్నాయని, వాటిలో భాగంగానే రోజాకు ప్రాముఖ్యత తగ్గించే ప్రయత్నం జరుగుతోందని టాక్.
ఈ అంతర్గత పోరు మూలాన రోజా పార్టీలో తన ఉనికికే ముప్పు రావచ్చని, ఈ అంశాన్ని వైఎస్ జగన్ ముందు పెట్గాలని భావిస్తున్నారట. ఈ వ్యూహాన్ని తట్టుకుని తాను నిలబడాలంటే మంత్రి పదవి ఉండాల్సిందేననే విషయాన్ని సైతం అధినేత ముందుంచే అవకాశాలున్నాయట. సో.. వచ్చే మంత్రి పదవి ఏదో త్వరగా వస్తే రోజాగారికి బెంగ ఉండదు. మరి వైఎస్ జగన్ ఆమెకు ఎలాంటి హామీ ఇస్తారో చూడాలి.