రెబల్ ఎమ్మెల్యేలపై చంద్రబాబు చర్యలెందుకు తీసుకోరు 

అధికారం కోల్పోయి కష్టాల్లో ఉన్న టీడీపీకి ముఖ్య నేతల అరెస్టులతో పాటు రెబల్ ఎమ్మెల్యేల బెడద కూడా ఎక్కువగా ఉంది.  అధికార పక్షం నుండి ఎదురవుతున్న ఇబ్బందుల్ని కిందామీదా పడుతూ ఎదుర్కుంటున్నారు కానీ పక్కలో బల్లెంలా తయారైన తిరుగుబాటు ఎమ్మెల్యేలను నోరెత్తి ఒక్క మాట అనలేకపోతున్నారు.  ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు ఇప్పటికే అనధికారికంగా టీడీపీకి దూరమై వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.  ప్రతి విషయంలో చంద్రబాబును బహిరంగంగా వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.  
 
ఇంత చేస్తున్న వీరు పదవికి రాజీనామా మాత్రం చేయట్లేదు.  ఎందుకంటే వైఎస్ జగన్ రాజీనామా చేసి తమ పార్టీలో చేరమని వారిని ఆదేశించలేదు కాబట్టి.  దీనికీ కారణం ఉంది.   ఎందుకంటే ఈ ముగ్గురూ రాజీనామా చేసి వైసీపీ తరపున ఉపఎన్నికలకు దిగితే గెలుస్తారనే నమ్మకం లేదు.  అలాగే టీడీపీకి రాజీనామా చేస్తే పిరాయింపు నిరోధక చట్టం కింద ఇబ్బందుకు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  అందుకే అధికారికంగా టీడీపీకి దూరం కాలేకపోతున్నారు.  ఇక చంద్రబాబు సైతం వారి మీద చర్యలు తీసుకోలేకున్నారు.  ఇందుకు ఆయన కారణాలు ఆయనకున్నాయి. 
 
పోయే వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తే పిరాయింపుల చట్టం పెట్టొచ్చు.  కానీ వాళ్ళు వెళ్ళరు.  ఒకవేళ పార్టీ నుండి సస్పెండ్ చేస్తే వారిపై పిరాయింపుల చట్టం ప్రయోగించే వీలుండదు.  అది రెబల్ ఎమ్మెల్యేలకే బెనిఫిట్.  కాబట్టి టీడీపీ వారిని సస్పెండ్ చేయదు.  సో.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పదవీ కాలం ముగిసేవరకు రెబల్ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ చంద్రబాబును ఇబ్బంది పెడుతూ అధికార పక్షం వద్ద తమకు కావాల్సిన పనులు జరుపుకుంటూ ఉంటారు.  పదవీ కాలం ముగిశాక టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుటారు.