రూ.194 కోట్లు ఖాతాల్లోకి పంపిన వైఎస్ జగన్ 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.  కరోనా లాక్ డౌన్ కారణంగా అనేక రాష్ట్రా ప్రభుత్వాలు ఆదాయం నిలిచిపోయి సంక్షేమ పథకాల అమలులో తలకిందులవుతున్నాయి.  కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేది లేదని తేల్చి చెప్పింది.  కానీ వైఎస్ జగన్ మాత్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను అమలుపరిచి తీరాల్సిందేనంటున్నారు.  
 
ఈ లాక్ డౌన్ మూడు నెలల్లోనే వాహనమిత్ర, జగనన్న చేదోడు, వైఎస్సార్ రైతు భరోసా లాంటి పథకాలను అమలుచేసి తాజాగా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని కూడా ఈరోజు అమలుచేశారు.  గతేడాది డిసెంబర్లో మొదటి విడతగా సొంత మగ్గం ఉండి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నేతన్నలు ఒక్కొక్కరికి 24,000ల ఆర్థిక సహాయం అందించిన జగన్ సర్కార్ ఈరోజు రెండో విడతను అమలు చేసింది.  మొత్తం 81,024 మంది నేతన్నలకు రూ.194.46 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తున్నారు.  దీంతో లబ్డిదారుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.  
 
షెడ్యూల్ ప్రకారమైతే డిసెంబర్లో ఈ రెండో విడత అమలుచేయాలి.  కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా అసలే కష్టాల్లో ఉన్న ల చేనేత కార్మికులు ఇంకాస్త ఎక్కువ ఇబ్బందికి లోనవుతారనే ఉద్దేశ్యంతో సీఎం 6 నెలల ముందుగానే ఆర్థిక సహాయాన్ని అందజేశారు.  గత ఏడాది కూడా ఈ పథకం కింద దాదాపు 200 కోట్లు చేనేత కార్మికులకు అందించారు సీఎం.  ఇలా వరుస పథకాల అమలుతో వైసీపీ ఏడాది పాలనలో సుమారు 3.9 కోట్ల మంది ప్రజల ఖాతాల్లోకి 40 వేల కోట్ల వరకు నగదు బదిలీ జరిగింది.   ఈ లెక్కల్ని చూపిస్తూ తమ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందని, సంక్షేమమే మా ప్రథమ లక్ష్యమని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.