రాజధాని విషయంలో బీజేపీ హ్యాండ్ ఇస్తుందా ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయంలో నిర్ణయాన్ని మార్చుకునే సూచనలు కనబడట్లేదు.  వేల మంది రైతులు గుండెలు బాదుకుంటున్నా, వేల కోట్ల పనులు వృథా అవుతున్నా, ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతున్నా రాజధానిని మార్చి తీరాల్సిందేనని వైఎస్ జగన్ పట్టుబట్టుకుని కూర్చున్నారు.  అభివృద్ది మొత్తం ఒకే ప్రాంతానికి పరిమితమైతే మిగతా ప్రాంతాల మాటేమిటని, అభివృద్ది ఫలాలు అందరికీ అందాలని అంటూ ముందుకుపోతున్నారు.  ఇప్పటికే అమరావతిలో కట్టిన నిర్మాణాలను అమ్మకానికి పెట్టనున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. 
 
 
వైఎస్ జగన్ ఇంత ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నా కేంద్రం ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  భాజపా రాష్ట్ర నాయకులు కూడా రాజధాని విషయంలో పెద్దగా రివర్స్ కావడం లేదు.  ఇందుకు లాలూచి రాజకీయాలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి.  అధికారంలో ఉన్న ఇరు పార్టీలు రహస్య ఒప్పందంలో ఉన్నాయని, ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ ఎవరి ప్రయోజనాలను వాళ్లు కాపాడుకుంటున్నారని చాలామంది చెబుతున్న మాట.  ఆ మాటలకు బలం చేకూర్చేలా గతంలో పలు విషయాలు జరిగాయి. 
 
 
కానీ అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదంటున్నారు.  సెంట్రల్ లెవల్లో బీజేపీ ప్లాన్ వేరే ఉందట.  అందుకే తెర వెనుక ఇచ్చిన భరోసాను మెల్లగా తగ్గించచుకుంటోందట.  ఇప్పటివరకు అమరావతి మీద మాట్లాడని భాజపా కీలకమైన సమయం వచ్చినప్పుడు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదనేది విశ్లేషకుల మాట.  వారి మాటలకు తగ్గట్టే ఈరోజు అమరావతి రైతుల 200 రోజుల దీక్షలను ఉద్దేశించి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ‘నేను గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది’ అని ట్వీట్ చేశారు.  దీంతో వైకాపా గనుక బీజేపీ మీద భరోసా పెట్టుకుని ఉంటే వారికి ఒట్టి చేతులే మిగులుతాయని స్పష్టమవుతోంది.