రాజధాని మార్పు తథ్యమని తేలిపోయింది 

వైఎస్ జగన్ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో మూడు రాజధానుల నిర్ణయం కూడా ఒకటి.  శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండాలని నిర్ణయించారు.  అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలతో పాటు అమరావతి రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలిపారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిని అమరావతి నుండి తరలిపోనివ్వమని అన్నారు.  రైతులైతే ఇప్పటికీ నిరసన దీక్షలు చేస్తూనే ఉన్నారు.  గతంలోనే ప్రభుత్వం కొన్ని కార్యాలయాలను తరలించే పనులు చేపట్టారు.  కానీ లాక్ డౌన్ కారణంగా కార్యకలాపాలన్నీ ఆగిపోవడంతో రాజధాని మార్పు ఇప్పుడప్పుడే ఉండదని అంతా భావించారు. 
 
కానీ ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందని, తన ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని, ఈ బిల్లు ఆమోదం పొందుతుందని అనడంతో ప్రభుత్వం రాజధాని తరలింపులో ఏమాత్రం వెనక్కి తగ్గేలా లేదని స్పష్టమైంది.  అయితే గతంలోనే ఈ బిల్లును తమ సంఖ్యా బలం ద్వారా అసెంబ్లీలో ఆమోదించుకున్న వైసీపీ సర్కార్ శాసన మండలిలో మాత్రం నెగ్గించుకోలేకపోయింది.  అయితే త్వరలో మండలిలో కూడా వైకాపాకు బలం పెరగనున్న నేపథ్యంలో అక్కడ బిల్లు ఆమోదం పొందడం అనేది పెద్ద సమస్యేమీ కాదు. 
 
 పైగా ఈ రాజధానుల వ్యవహారంలో పరిపాలనా సౌలభ్యం కింద ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఎలాగూ ఉంది.  దీన్నిబట్టి ప్రభుత్వం రాజధాని మార్పుకి వేగంగా పావులు కదుపుతున్నట్టు స్పష్టమైంది.  ఇక ఎప్పటిలాగే ఈ ప్రక్రియను అడ్డుకుని తీరుతామని ప్రతిపక్షం టీడీపీ సవాల్ విసిరింది.  ఇన్నాళ్ళు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే ప్రభుత్వం కార్యాలయాల తరలింపుతో మరింత భారం మీద వేసుకుంటోందని కోర్టులో వ్యాజ్యాలు వేస్తూ వచ్చిన ప్రతిపక్షం ఇకపై కూడా కోర్టుల ద్వారానే తరలింపును అడ్డుకుంటుందా లేకపోతే కొత్త వ్యూహాలు ఏమైనా చూసుకుంటుందా అనేది చూడాలి.