మెగాస్టార్ చిరంజీవి లేఖతో.. మొత్తం మారిపోయిందా.?

అసలు మెగాస్టార్ చిరంజీవి ‘మా’ ఎన్నికల విషయమై ఎందుకు లేఖ రాయాలి.? హేమని ఎందుకు చిరంజీవి బలిపశువుని చేసేశారు.? ఇలాంటి ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. ‘మా’ ఎన్నికల విషయమై జరుగుతున్న రచ్చ నేపథ్యంలో పరిశ్రమ పెద్దగా, ‘మా’ వ్యవస్థాపక అధ్యక్షుడినన్న బాధ్యతతో మెగాస్టార్ చిరంజీవి, క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకి తాజా పరిస్థితులపై ఓ లేఖ రాశారు. అందులో, హేమ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరలేదు. కానీ, చిరంజీవి లేఖ రాశాకనే, హేమకి షోకాజ్ నోటీస్ వెళ్ళింది. హేమ, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మీద ఆరోపణలు గుప్పించారు అంతకు ముందు. అయితే, ఆమె ఆరోపణల్ని పూర్తిగా తప్పు పట్టేయడానికి లేదు. ఎన్నికలు ఆలస్యమవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నది చిరంజీవి అభిప్రాయం తప్ప, ఎవర్నో శిక్షించాలని ఆయన కోరలేదు తన లేఖలో.

ఇదిలా వుంటే, ప్రతి విషయాన్నీ చిరంజీవికి ఆపాదించడం ద్వారా టీఆర్పీ రేటింగులు పెంచుకోవాలనీ, వ్యూస్ పెంచుకోవాలనీ ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా ప్రయత్నించడం కొత్తేమీ కాదు. చాలా సందర్భాల్లో ఇలాంటివి జరిగాయి, ఇప్పుడూ జరుగుతున్నాయి. అసలంటూ ఎన్నికలు జరిగితే, ఈ వివాదాలకే ఆస్కారముండదు. ఎన్నికల నిమిత్తం ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆయా వ్యక్తుల మధ్య మామూలే. ఆ తర్వాత ఎవరి పని వారిదే. అంతిమంగా అందరూ సినీ కళామతల్లి బిడ్డలే. ఎవరెన్ని విమర్శలు ఎన్నికల సమయంలో చేసుకున్నా, సినిమాల్లో కలిసి నటించాల్సిందే కదా.? నటించడమే కాదు, వ్యక్తిగతంగానూ ఎవరి మధ్యా విద్వేషాలైతే వుండవు. అందుకే, అన్నీ ఆలోచించి మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. దాంతో, పరిస్థితి ప్రస్తుతానికి సద్దుమణిగింది. హేమకు వెళ్ళింది షోకాజ్ నోటీసు మాత్రమే. ఆమె సరైన వివరణ ఇస్తే, వివాదం సద్దుమణిగిపోతుంది.