‘శాకుంతలం’ మూవీ రివ్యూ & రేటింగ్

సమంత, దేవ్ మోహన్ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ నేడు (ఏప్రిల్ 14, 2023) తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘యశోద’ తర్వాత సమంత ఈ చిత్రం ద్వారా మరో విజయం అందుకున్నారా? లేదా? మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం..

కథ: విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి మేనక (మధుబాల)ను ఇంద్రుడు భూలోకానికి పంపిస్తాడు. తపస్సు భంగం కావడమే కాదు… వాళ్ళిద్దరూ శారీరకంగా ఒక్కటి అవుతారు. ఫలితంగా మేనక ఓ అమ్మాయికి జన్మనిస్తుంది. ఆ చిన్నారిని భూలోకంలో వదిలి స్వర్గానికి వెళ్ళిపోతుంది. అడవిలో చిన్నారిని చూసిన కణ్వ మహర్షి శకుంతల అని పేరు పెట్టి కన్న బిడ్డలా పెంచుతాడు. కట్ చేస్తే… శకుంతల పెద్దది అవుతుంది. ఓ రోజు దుష్యంతుడు (దేవ్ మోహన్) మహా రాజు ఒకసారి వేటకు వెళ్లినప్పుడు కణ్వ మహర్షి (సచిన్ ఖేడేకర్) ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. అక్కడ ఉన్న శకుంతల (సమంత)ను చూసి ఆమె సౌందర్యానికి ఆకర్షితుడవుతాడు. శకుంతల కూడా దుష్యంతుడి ప్రేమలో పడుతుంది. ఇద్దరూ గాంధర్వ వివాహం చేసుకుని ఒక్కటి అవుతారు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత సకల రాచ మర్యాదలతో ఆహ్వానించి, మహారాణిగా ప్రజలకు పరిచయం చేస్తానని చెబుతాడు. శకుంతల గర్భవతి అవుతుంది. ఎంతకూ దుష్యంతుడు రాకపోవడంతో అతడి దగ్గరకు వెళుతుంది. కణ్వ మహర్షి ఆశ్రమానికి తాను వెళ్ళిన విషయం గుర్తుంది కానీ శకుంతల ఎవరో తనకు తెలియదని దుష్యంత మహారాజు చెబుతాడు. అతడు ఎందుకు అలా చెప్పాడు? నిండు సభలో శకుంతలకు జరిగిన అవమానం ఏమిటి? ఆ తర్వాత ఏమైంది? మధ్యలో దుర్వాస మహాముని (మోహన్ బాబు) పాత్ర ఏమిటి? దుష్యంతుడు, శకుంతల చివరకు ఎలా ఒక్కటి అయ్యారు? ఆ తర్వాత వీరి జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏమిటి ?, దుష్యంతుడు అసలు శకుంతలను ఎలా మర్చిపోతాడు ?, చివరకు వీరి ప్రేమ కథ ఎక్కడికి దారితీసింది? ఎలా ముగిసింది ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ : అందరికీ తెలిసిన కథను మళ్ళీ చెప్పడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటి వ్యవహారం. అందులోనూ ఎటువంటి మలుపులు లేని అభిజ్ఞాన శాకుంతలం కథను యథాతథంగా తీయాలనుకున్నప్పుడు ప్రతి సన్నివేశం ఓ దృశ్యకావ్యం అన్నట్లు ఉంటే తప్ప ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడం కష్టం. గుణశేఖర్ వంటి దర్శకుడికి ఇవేవీ తెలియనివి కాదు. అయితే… ఆయన లెక్క తప్పింది. దేవ్ మోహన్ బదులు తెలుగు హీరో ఎవరినైనా తీసుకుని ఉంటే బావుండేది. సమంత కంటే ఆయనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. సమంతను చూడాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఇదీ మింగుడుపడని అంశమే. పౌరాణిక ప్రేమ జంట ‘శకుంతలా దుష్యంతుల’ ప్రేమ కథకు 3డి ఎఫెక్ట్ అద్ది.. బ్యూటిఫుల్ విజువల్స్ తో దర్శకుడు గుణశేఖర్ ఈ శాకుంతలం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే, గుణశేఖర్ విజువల్స్ మరియు టేకింగ్ మీద పెట్టినంత శ్రద్ద కథకథనాల పై పెట్టలేదు. రొటీన్ ప్లే అండ్ బోరింగ్ ట్రీట్మెంట్, రెగ్యులర్ లవ్ డ్రామా వంటి అంశాలు ఈ సినిమాకి బాగా మైనస్ అయ్యాయి. కంటెంట్ పరంగా నిరుత్సాహ పరిచిన ఈ సినిమా విజువల్స్ పరంగా మాత్రమే ఆకట్టుకుంది. ఎమోషనల్ గా లవ్ స్టోరీతో సాగే ఈ సినిమా విజువల్ పరంగా కొంతవరకు ఆకట్టుకున్నా.. కథ పరంగా ఎలాంటి కొత్తదనం లేదు. అలాగే ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన విజువల్స్ తో అక్కడక్కడ కాస్త ఇంట్రెస్ట్ గా నడిపినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను నెమ్మదిగా నడిపారు. సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ చాలా స్లోగా సాగుతాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సమంత పాత్ర గర్భవతి అయ్యాక వచ్చే సీన్స్ ను అనవసరంగా ల్యాగ్ చేస్తూ డ్రైవ్ చేయడం వల్ల, ఆ సాగదీత సీన్స్ లో ఇంట్రస్ట్ మిస్ అయింది.

అలాగే మధ్యమధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కట్స్ కూడా కొంత ఇబ్బంది పెడుతాయి. ఇంకా టైట్ స్క్రీన్ ప్లే ఉండి ఉంటే ఈ సినిమా కొంతవరకు అయినా సంతృప్తికరంగా ఉండి ఉండేది. మెయిన్ గా సినిమాలో ప్రేమ కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ బాగా పెట్టి ఉండాల్సింది. ‘శాకుంతలం’ థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులపై పడిన మొదటి దెబ్బ విజువల్ ఎఫెక్ట్స్ & త్రీడీ వర్క్. గుణశేఖర్ ఊహలో తప్పు లేదు. కానీ, ఆ ఊహ తెరపైకి ఎంత అందంగా వచ్చింది? అనేది ముఖ్యమే కదా! ప్రేక్షకుడికి ఆ ఊహ తెలిసినపుడేగా విజయం వరించేది. ఆయన ఊహ విజువలైజేషన్ రూపంలోకి రాలేదనేది ముమ్మాటికీ నిజం! సన్నివేశాల్లో అసలు బలం లేదు. కథలో బలమైన సంఘర్షణ లేదు. దేవ్ మోహన్, సమంత మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. ప్రేమకథలో, సన్నివేశాల్లో బలం కంటే హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కుదిరితే సినిమా పాస్ అయిపోయినట్టే. ఇక్కడ అది కూడా లేదు. దాంతో సీరియల్ సాగినట్లు సన్నివేశాలు సాగాయి. రణభూమిలో యుద్ధ సన్నివేశాలు సైతం పేలవంగా సాగాయి. ఎప్పుడు అయిపోతుందా? అన్నట్లు నడుస్తుంది సినిమా. సినిమా చూస్తున్నంత సేపు మహాభారతంలోని ఆది పర్వంలోకి వెళ్లి.. శకుంతలా దుష్యంతుల ప్రేమ గాధను, బాధను కళ్ళ ముందు చూస్తున్న బావన కలుగుతుంది. ముఖ్యంగా 3డి విజువల్స్ సినిమా స్థాయిని పెంచాయి. అలాగే ప్రేక్షకులకు ఆ అడవి ప్రాంతంలోకి వెళ్లి ఆ లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మొత్తమ్మీద అద్భుతమైన విజువల్స్ తో పాటు భారీ సాంకేతిక విలువలతో తెరకెక్కించబడటమే ఈ సినిమా ప్రధాన బలం. ప్రధాన పాత్రల ఎమోషన్ అండ్ పెయిన్ ఫ్యామిలీ ప్రేక్షకులకు కొంతవరకు కనెక్ట్ అవుతుంది.

నటీనటులు ఎలా చేశారు? : ఇక సమంత తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. దుర్వాస మహాముని పాత్రలో మోహన్ బాబు కాసేపు కనిపించారు. కీలక పాత్రలో నటించిన ఆయన తన మ్యానరిజమ్స్ తో తన శైలి నటనతో బాగా ఆకట్టుకున్నారు. కంచు కంఠంతో డైలాగులు చెబుతూ సన్నివేశాలకు ప్రాణం పోశారు. పతాక సన్నివేశాల్లో శకుంతల, దుష్యంతుల కుమారుడిగా అల్లు అర్హ కనిపించారు. ఆ చిన్నారి నటన ముద్దొస్తుంది. తెలుగు డైలాగులను అర్హ చక్కగా చెప్పింది. హీరోగా నటించిన దేవ్ మోహన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఆయనకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో అతడి నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిగిలిన నటీనటులు సచిన్ ఖేడేకర్, ప్రకాష్ రాజ్, గౌతమి, కబీర్ బేడీ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికంగా… దర్శకుడు గుణశేఖర్ భారీ విజువల్స్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలను అద్భుత విజువల్స్ తో బాగా తెరకెక్కించినప్పటికీ.. కథాకథనాలను మాత్రం ఆ స్థాయిలో ఆయన రాసుకోలేదు. మణిశర్మ అందించిన సంగీతం ఏవరేజ్ గా ఉంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఓకే. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. అయితే ఈ సినిమా ఏ దశలోనూ ఆకట్టుకోదు. సన్నివేశాల్లో సాగదీత, వరస్ట్ త్రీడీ వర్క్ వెరసి ప్రేక్షకుల కళ్ళను కష్టపెడతాయి. థియేటర్లలో చివరి వరకూ కూర్చోవాలంటే చాలా ఓపిక కావాలి. శాకుంతలం… ప్రేక్షకుడి సహనానికి పరీక్ష!

(విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023, రేటింగ్ : 2.25/5, నటీనటులు: స‌మంత, దేవ్ మోహ‌న్, మోహ‌న్ బాబు, అల్లు అర్హ, శివ బాలాజీ, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిష్షు సేన్ గుప్తా తదితరులు. రచన, దర్శకత్వం : గుణశేఖర్, నిర్మాతలు: నీలిమా గుణ-దిల్ రాజు, సంగీతం : మణిశర్మ, సినిమాటోగ్రఫీ : శేఖర్.వి.జోసెఫ్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, మాటలు : సాయి మాధవ్ బుర్రా , పాటలు : చైతన్య ప్రసాద్, శ్రీమణి, నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్, సమర్పణ : ‘దిల్’ రాజు)
-ఎం.డి. అబ్దుల్