గురు సమానులు కె విశ్వనాథ్ గారు కాలం చేశారని మాట వినడమే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయనకు మరణం లేదు ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన వారి అభిమానంలో బతికే ఉంటారు. మేమందరం ఆయన సినిమాలు చూసి పెరిగాము, కృష్ణంరాజు గారు కూడా అనేక సందర్భాలలో విశ్వనాధ్ గారిని తలుచుకుంటూ ఉండేవారు. మనసు బాలేనప్పుడు శంకరాభరణం పాటలు పెట్టుకుని వింటూ ఉండేవారు అంత అద్భుతమైన పాటలు అవి. నిజానికి దానికి శంకరాభరణం లో సోమయాజులు గారు నటించిన పాత్రను ముందుగా కృష్ణంరాజు గారిని విశ్వనాధ్ గారు చేయమని అడిగారట, అయితే ఇప్పటికే నన్ను అందరూ రెబల్ స్టార్ అని పిలుస్తున్నారు, మీరు అనుకున్న పాత్రకు నేను చేయలేను అని అనడంతో ఆ అవకాశం సోమయాజులు గారికి దక్కింది.
అయితే వారిద్దరి అనుబంధం ఎప్పటికీ విడదీయలేనిది. చెన్నైలో ఉన్నప్పటి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా వారి మధ్య ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాలు పంచుకుంటూ ఉండేవారు. ఒకసారి గామా అవార్డుల కోసం కృష్ణంరాజు గారు దుబాయ్ వెళితే అదే అవార్డుల ఫంక్షన్ కి విశ్వనాథ్ గారు కూడా హాజరయ్యారు, అప్పుడు ఆయన ఈ అవార్డులు మేము వయసులో ఉండగా కదా ఇవ్వాల్సింది వయసు అయిపోయిన తర్వాత ఏమి ఎంజాయ్ చేస్తాం, బట్ట తల వచ్చిన తర్వాత బంగారు దువ్వెన ఇస్తే మాత్రం ఏం లాభం అంటూ చమత్కరించారని గుర్తు చేసుకున్నారు.
కృష్ణంరాజు గారు బతికి ఉన్న సమయంలో సుమారు 7, 8 నెలల క్రితం ఒకసారి తనను విశ్వనాథ్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చూసి రమ్మని పంపించారని ఆ సమయంలో ఏమీ తినలేక పోతున్నాను షుగర్ వచ్చింది కాబట్టి స్వీట్ తిననివ్వడం లేదని బాధపడ్డారని డైటీషియన్ ఖాదర్ వలీ గారు తాటి బెల్లం, ఈత బెల్లం వాడవచ్చని చెప్పారని అంటే తనకు స్వీట్ చేసి ఇవ్వమని విశ్వనాథ్ గారు అడగడంతో తాను ఇంటికి వెళ్లి స్వీట్ చేసి పంపించానని అన్నారు.
ఆ విషయం మొన్నటి వరకూ ఎంతో మందికి చెప్తూ ఉండేవారని, అలాగే తన వద్దకు వచ్చిన ఖాదర్ వలీ గారిని విశ్వనాథ్ గారిని కూడా ఒకసారి చూసి రమ్మని కృష్ణంరాజు గారు పంపారని ఆ విషయాన్ని కూడా విశ్వనాథ్ గారు చాలా మందికి చెప్పి ఆనందపడుతూ ఉండేవారని అన్నారు. ఇక విశ్వనాథ్ గారు, కృష్ణంరాజు గారి లాంటి మహానుభావులకు చావు లేదని వారి సినిమాల ద్వారా వారి సాహిత్యం ద్వారా బతికే ఉన్నారని ఈ సందర్భంగా శ్యామల చెబుతూ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు.