‘బొచ్చులో నాయకత్వం’ మీద ఎంపీని వివరణ కోరిన వైసీపీ అధిష్టానం 

Kanumuru Raghu Rama Krishna Raju
ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొన్నిరోజులుగా వైసీపీ మీద, నాయకుల మీద సంచలన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.  వాద ప్రతివాదనలతో ఈ వివాదం పెద్దదైంది.  రాఘురామరాజు ఎవ్వరినీ లెక్కచేయకపోవడంతో అధిష్టానం మండిపడుతోంది.  నరసాపురం పార్లమెంట్ ఎమ్మెల్యేలంతా ఎంపీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దీంతో పార్టీ రాఘురామరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు మీద ఈ నోటీసులు జారీ అయ్యాయి.  వారం రోజుల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని లేని పక్షంలో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకుంటామని పార్టీ తెలిపింది. 
 
 
 
ఇక నోటీసుల్లో అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనేది మ వైసీపీ మేనిఫెస్టోలో ఒకటి.  మీరు దాన్ని తప్పుబట్టారు.  అది పార్టీ లక్ష్యాలను లెక్కచేయకపోవడమే.  దాని మీద వివరణ ఇవ్వాలి.  అలాగే ఎలాంటి ఆధారాలు లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నార్నై ఆరోపించారు.  మీరు వైసీపీ ఇచ్చిన టికెట్ మీద, జగన్ గారి నాయకత్వంలో గెలిచారు.  కానీ మీ గెలుపుకు, పార్టీకి సంబంధం లేదంటున్నారు.  అభివృద్ది వికేంద్రీకరణ కోసం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.  వీటి మీద మీ వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులో పేర్కొన్నారు. 
 
 
అలాగే ఒక సంధర్భంలో ‘ఎవరి నాయకత్వం కావాలి.  బొచ్చులో నాయకత్వం’ అంటూ రాఘురామరాజు మాట్లాడిన మాటలను పరిగణలోకి తీసుకున్న పార్టీ వాటికి కూడా వివరణ ఇవ్వాలని, అలాగే సింహం సింగిల్ గా వస్తుంది అంటూ మిగతా ఎమ్మెల్యేల పందులతో పోల్చుతూ మాట్లాడటం మీద కూడా వివరణ డిమాండ్ చేశారు.  మొత్తం మీద నోటీసుల్లోని అంశాలను చూస్తే ఎంపీ వ్యవహారంతో  తీవ్రంగా నొచ్చుకున్న అధిష్టానం ఏదో ఒకటి తేల్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది.