పవన్ విషయంలో సాయిరెడ్డి తగ్గారు ఎందుకనో ?

వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా చేసే విమర్శలు తక్కువే అయినా సోషల్ మీడియాలో చేసే హడావుడి మాత్రం భీభత్సంగా ఉంటుంది.  రాజకీయ ప్రత్యర్థుల మీద అదే పనిగా పెట్టుకుని ట్వీట్లు వేస్తుంటారు.  కొన్నిరోజుల క్రితం వరకు ఒక చేత్తో చంద్రబాబు, లోకేష్ మీద ఇంకో చేత్తో జనసేన పవన్ కళ్యాణ్ మీద విమర్శలు తెగ గుప్పించేవారు.  కానీ ఈమధ్య పవన్, జనసేన పార్టీని వదిలేసి కేవలం చంద్రబాబు మీద మాత్రమే విమర్శలు చేస్తున్నారు. 
 
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు పావలా కళ్యాణ్, చంద్రబాబు బీ టీమ్, దత్తపుత్రుడు అంటూ రకరకాల వ్యంగ్యపు పేర్లు పెట్టి సంభోదించేవారు విజయసాయిరెడ్డి.  అసలు పవన్ ఏ పొలిటికల్ మూవ్ తీసుకున్నా అది చంద్రబాబుకు మేలు చేయడం కోసమేనన్నట్టు మాట్లాడారు.  బయటికి వేరు వేరుగా ఉన్నా బాబు, పవన్ మధ్య రహస్య పొత్తు నడుస్తుందనే వదంతిని జనంలో బాగా ప్రాచుర్యం పొందేలా చేసింది సాయిరెడ్డిగారే.  అలాంటి సాయి రెడ్డి ఇప్పుడు పవన్ విషయంలో సైలెంట్ అయిపోయారు. 
 
ఆయన ట్విట్టర్ ఖాతా చూస్తే ఈమధ్య పవన్ మీద ట్వీట్లు వేయలేదు.  సాయిరెడ్డిలో ఈ మార్పు వెనుక మోదీ ఉన్నారనే మాటలు వినబడుతున్నాయి.  పవన్ ఈమధ్యే భాజాపాతో పొత్తును అధికారికం చేసుకున్నారు.  అంటే ఏపీలో భాజాపా, జనసేన మిత్రపక్షాలు.  పైన కేంద్రంలో భాజాపా అధికారంలో ఉంది.  కాబట్టి పవన్ కు పొలిటికల్ బ్యాకప్ బలంగా ఉన్నట్టే.  ఆ కారణంతోనే ఇన్నాళ్ళు పవన్ మీద అవసరం లేకపోయినా ట్వీట్లు పారేసుకున్న విజయసాయిరెడ్డి దూకుడు కొంచెం తగ్గించారని జనసేన శ్రేణులు సైతం చెప్పుకుంటున్నాయి.