నిమ్మగడ్డ X ఏపీ సర్కార్.. డ్రామా ఇంకా మిగిలే ఉంది 

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసింది.  పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వలేమని తెలిపింది.  దీంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.  అలాగని నిమ్మగడ్డకు అనుకూలంగా పూర్తిస్థాయి తీర్పు కూడా రాలేదు.  సుప్రీం కోర్టు కేవలం హైకోర్టు ఉత్తర్వుల మీద స్టే ఇవ్వలేమని మాత్రమే చెప్పింది కానీ హైకోర్టు తీర్పును అమలుచేయాలని ఆదేశించలేదు.  పైగా కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది. 
 
కాబట్టి ఈ రెండు వారాల్లో చాలా డ్రామా జరిగే అవకాశం ఉంది.  సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి తనకు ఫేవర్ జరిగిందని రమేశ్ కుమార్ వెంటనే వెళ్లి ఈసీ పదవిలో కూర్చోలేరు.  కూర్చుంటానన్నా ప్రభుత్వం ఒప్పుకోదు.  కేసు సుప్రీం కోర్టులో ఉంది కదా అంటుంది.  అలాగని ప్రభుత్వం తన గత చర్యలను సమర్థించుకునే వీలు కూడా లేదు.  ఎండుకంటే రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవద్దని, ఆర్డినెన్స్ వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యాలు సంతృప్తికరంగా లేవని ధర్మాసనం అక్షింతలు వేసింది.  కాబట్టి వారి చర్యలను వారు సమర్థించుకోవడానికి లేదు.  
 
ఇక రమేశ్ కుమార్ ఎలాగూ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వలేదు కాబట్టి హైకోర్టు తీర్పును వెంటనే అమలుచేయాలని కోరుతూ మళ్లీ హైకోర్టుకు వెళ్లొచ్చు.  అలా వెళితే అక్కడ కూడా రెండు రకాల తీర్పులు రావొచ్చు.  హైకోర్టు తన తీర్పు మీద స్టే లేదు కాబట్టి వెంటనే అమలుచేయాలని మరోసారి  ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు.  అలా చేసినా ఏపీ ప్రభుత్వం తీర్పులో తమకు అభ్యంతరాలు ఉన్నాయని, అందుకే స్పష్టత కోసం సుప్రీంకు వెళ్లామని, అక్కడ వ్యవహారం తేలే వరకు వేచి చూస్తామని అనొచ్చు. 
 
అలా కాకుండా హైకోర్టే నేరుగా కేసు ఎలాగూ సుప్రీం పరిధిలో ఉంది కాబట్టి తాము జోక్యం చేసుకోలేమని, తుది తీర్పు ఏదో సుప్రీం కోర్టే ఇస్తుంది కాబట్టి అక్కడే తేల్చుకోవాలని చెప్పొచ్చు.  ఈ పాజిబిలిటీస్ నిమ్మగడ్డకు తెలియని కావు.  కాబట్టి ఆయన హైకోర్టుకు వెళ్లినా వెళ్ళకపోయినా ఇప్పుడప్పుడే తుది తీర్పు రాదు.  రెండు వారాల ప్రతివాదుల కౌంటర్లు కూడా పరిశీలించాక సుప్రీం ఏమైనా స్పష్టత ఇచ్చే వీలుంది.  లేకపోతే రెండు వారాల తర్వాత కూడా తీర్పు చెప్పడానికి ఒకటో రెండో వాయిదాలు తీసుకోవచ్చు.  సో.. నిమ్మగడ్డ వెర్సెస్ ఏపీ సర్కార్ వివాదంలో ఇంకా చాలా డ్రామా నడవనుంది.