తెలంగాణలో కరోనా ఆందోళన తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. రోజూ 100కి పైగా కేసులు నమోదవుతున్నాయి. హైదరబాద్ సిటీలోనే అత్యధిక కేసులు వస్తున్నాయి. మొదటి నుండి కేసీఆర్ టెస్టులు చేయకుండా జాప్యం చేస్తున్నారని, అధికార పార్టీ అలసత్వం వల్లనే కేసులు విపరీతంగా పెరిగాయని ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలోనే తక్కువ స్థాయిలో పరీక్షలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణా కూడా ఉందని వాదిస్తున్నారు. హైకోర్టు సైతం ఎందుకు తక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మరోవైపు కేసీఆర్ సర్కార్ మాత్రం ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తోంది. యంత్రాంగం సమర్థంగా కరోనాను ఎదుర్కుంటోందని పేర్కొంది. హైదరాబాద్లో ఎన్ని కేసులు వచ్చినా అందరినీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించే సామర్థ్యం ప్రభుత్వ ఆసుపత్రులకు ఉందని, గాంధీలో ఆక్సీజన్ సౌకర్యం ఉన్న బెడ్లు ఇంకా 1000 ఉన్నాయని అన్నారు. వైద్యశాఖ అధికారులు, నిపుణులు కూడా వైరస్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆసుపత్రుల్లో తగిన సామర్థ్యం ఉందని వివరించారు.
వాస్తవ పరిస్థితికి, మీడియాలో చూపుతున్న దానికి చాలా తేడా ఉందని, ప్రజలను గందరగోళానికి గురిచేయడానికే ఎవరో కావాలని కుట్ర పన్నుతున్నారని తెలిపింది. ఇక హైకోర్టు చెప్పినట్టు చనిపోయిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించడం సాధ్యంకాదని పేర్కొన్నారు. ఇక మరణాల విషయంలో మాత్రం సర్కార్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదనను వినిపిస్తోంది. కరోనా మరణాలుగా చెబుతున్నవన్నీ కేవలం వైరస్ వల్ల సంభవించినవి కాదని, దాదాపు 95 శాతం మంది ఇతర కారణాలతో చనిపోయిన వారేనని కిడ్నీ, గుండె, లివర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడే వారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, షుగర్, బీపీ ఉన్నవారు కూడా ఉన్నారు. ఇతర జబ్బులతో చనిపోయినప్పటికీ, వారికి కరోనా పాజిటివ్ ఉంది కాబట్టి కొవిడ్‌తోనే చనిపోయినట్లు నిర్ధారిస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్లే ప్రజల్లో ఆందోళన ఎక్కువవుతోందిని అన్నారు.