జేసీ అత్యుత్సాహం.. ఏం సాధిద్దామని.?

అనంతపురం జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే జేసీ బ్రదర్స్ గురించి మాట్లాడుకోవాల్సిందే. ఒకప్పుడు అధికారంలో వున్నారు గనుక.. ఏం చేసినా చెల్లిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఓ పోలీస్ అధికారిని సవాల్ చేసి, రాజకీయంగా తన అడ్రస్ గల్లంతు చేసుకున్నారు జేసీ దివాకర్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి విషయానికొస్తే, బోల్డన్ని కేసుల్ని ఎదుర్కొంటున్నారు. అనూహ్యంగా ఆయన తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ అయ్యారండోయ్. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి దక్కిన ఒకే ఒక్క పాజిటివ్ ఫలితమిది. అది కూడా వైఎస్సార్సీపీ దయతోనేనని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడేమో, ఆయన అధికారుల మీద గుస్సా అవుతున్నారు. ఎమ్మెల్యే నిర్వహించే సమావేశాలకు వెళుతున్న అధికారులు, తాను నిర్వహించే సమీక్షా సమావేశాలకు రావడంలేదంటూ, హైడ్రామా షురూ చేశారు.

అధికారుల కోసం కార్యాలయంలో వేచి చూసి, అక్కడే బస చేసి.. అబ్బో, జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన పబ్లిసిటీ స్టంటు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ విషయంలో అధికారుల తప్పిదం కూడా లేకపోలేదు. కానీ, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. ఇలాంటివెన్నో గతంలో చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇది వింతగా ఎందుకు కనిపిస్తోందో ఏమో. అధికారులకు నోటీసులు పంపడం, అధికార పార్టీ మీద గుస్సా అవడం.. ఇవన్నీ జేసీ ప్రభాకర్ రెడ్డి బలాన్ని పెంచుతాయా.? ఏం చేసినా అనంతపురం జిల్లాల్లో తిరిగి జేసీ బ్రదర్స్ తమ ఉనికిని చాటుకునే అవకాశాల్లేవు. రాజకీయంగా ఆ స్థాయికి జేసీ కుటుంబం తన పరువు ప్రతిష్టల్ని తానే నాశనం చేసేసుకుంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు హయాంలో జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి చెలరేగిపోయారు.. సొంత పార్టీనే దెబ్బ తీసుకున్నారు.. ఫలితం అనుభవిస్తున్నారిప్పుడు.