జీవీఎల్ ఏపీలో నాన్ లోకల్

ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలు అగ్గిరాజేస్తున్నాయి. సోమువీర్రాజు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు అయిన తర్వాత వర్గాల వారీగా పార్టీ పూర్తిగా చీలిపోయింది. సోము వీర్రాజు తన వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ మిగతా నేతలందర్నీ పక్కన పెట్టేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. తన వర్గానికి చెందిన వాళ్లు అయితే చాలు ఏపీతో సంబంధం లేకున్నా వారికి పెద్ద పీట వేస్తున్నారని మిగత వారందరితో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ వ్యావహారాల్లో జీవీఎల్ నరసింహారావు జోక్యాన్ని ఏమాత్రం అంగీకరించడం లేదు స్థానిక నేతలు.


మొన్నటి వరకు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్… ఇప్పుడు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. యూపీ నుంచి ఎన్నికైన ఆయనకు ఏపీతో పనేంటని ప్రశ్నిస్తున్నారు స్థానిక కమళం పార్టీ నేతలు. రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఏపీ నుంచి  రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్‌ లాంటి సీనియర్లను పక్కన పెట్టేసిన సోమువీర్రాజు….ఎక్కడో యూపీ నుంచి రాజ్యసభకు ఎంపీ అయిన జీవీఎల్ తో రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చర్చిస్తున్నారని మండిపడుతున్నారు. ఇటీవలే విశాఖలో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశానికి స్థానిక రాజ్యసభ ఎంపీలను ఆహ్వానించకుండా జీవీఎల్ ను పిలవడం పై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

జీవీఎల్‌కు, ఏపీతో సాంకేతికంగా ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు.  గతంలో ఉన్నట్లు ఇప్పుడు ఆయన జాతీయ అధికార ప్రతినిధి హోదాలో కూడా లేరని చెబుతున్నారు. ఏపీలో రాష్ట్ర నేతల పత్తనేమే నడపాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నతోపాటు, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లను అంటరానివారిగా మార్చేస్తున్నారని తప్పుపడుతున్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ‘లిమిటెడ్ వ్యవహారం’గా మారిపోతున్నాయని మండిపడుతున్నారు.