ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అని సామెత! ప్రస్తుతం ఏపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక టాపిక్ ఈ సామెతను గుర్తు చేస్తుంది. ఏపీలో టీడీపీ – బీజేపీ పొత్తు పోడవబోతోందని, అందులో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించబోయే సీట్లు ఇవేనని ఒక లిస్ట్ వైరల్ అవుతుంది. అయితే ఈ లిస్ట్ వాస్తవానికి దగ్గరగా ఉందనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసిన సందర్భంగా పొత్తు పొడించిందని.. అందులో భాగంగా సీట్ల ప్రస్థావన వచ్చిందని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా… ఎనిమిది ఎంపీ సీట్లతోపాటు సుమారు 12 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారని ఆ ప్రతిపాదనతో కూడిన జాబితాను సీట్ల వివరాలను కూడా ఇచ్చేశారు అని ప్రచారం జొరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఒక లిస్ట్ కూడా ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.
ఈ విషయంలో ఎనిమిది ఎంపీల జాబితా విషయానికొస్తే… సుజనా చౌదరి (విజయవాడ), దగ్గుబాటి పురంధేశ్వరి (విశాఖపట్నం), మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి (కడప), సీఎం రమేష్ (రాజంపేట), టిజి వెంకటేష్ (కర్నూలు), కామినేని శ్రీనివాస్ (ఏలూరు), సత్యకుమార్ (నెల్లూరు), జీవిఎల్ నరసింహారావు (నరసరావుపేట) అని చెబుతున్నారు. అయితే వీరిలో మెజారిటీ నేతలు.. పొత్తు పొడవకపోతే టీడీపీలోకి జంపై పోయేవారనే టాక్ ఎప్పటినుంచో వినిపిస్తుంది.
ఇక ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే… వరదాపురం సూరి(ధర్మవరం), విష్ణువర్ధన్ రెడ్డి (కదిరి) విష్ణుకుమార్ రాజు(విశాఖ నార్త్), భానుప్రకాశ్ రెడ్డి(తిరుపతి), రమేష్ నాయుడు(రాజంపేట), పివిఎన్ మాధవ్(విశాఖ వెస్ట్), సాధినేని యామినిశర్మ (గుంటూరు వెస్ట్), ఎస్.కే. భాజి(విజయవాడ వెస్ట్), అంజనేయరెడ్డి (నెల్లూరు సిటీ), పూడి తిరుపతి రావు(ఆముదాలవలస), సోము వీర్రాజు(రాజమండ్రి సిటీ), లంకా దినకర్ (గన్నవరం)ల పేర్లు ఉన్నాయి.
చంద్రబాబు హస్తిన టూర్ తో ఇపుడు ఈ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ముందుగా చెప్పుకున్నట్లు ఈ లిస్ట్ కూడా వాస్తవానికి దగ్గరగా ఉందనే కామెంట్లు వినిపిస్తుండటంతోపాటు… వీరందరిలో మెజారిటీ నేతలు టీడీపీ సానుభూతిపరులు కావడం గమనార్హం!