జీవీఎల్ అసమర్థ మాటలు అద్భుతః!

గడిచిన ఎన్నికల్లో ఏపీలో 1శాతం ఓట్లు తెచ్చుకున్న ఏపీ బీజేపీ నేతలు ప్రస్తుతం సౌండ్ పెంచుతున్నారు. వరుసగా రెండు మీటింగుల్లో బీజేపీ అగ్రనేతలతో జగన్ సర్కార్ పై విమర్శలు చేయించడంతో… ఏదో సాధించేశామని ఫీలింగ్ లో ఉన్నట్లున్నారు. జగన్ పై విమర్శలు చేయడం ద్వారా ఆ పార్టీపై ప్రజల్లో విపరీతమైన అభిమానం పెరిగిపోయిందని.. ఫలితంగా రాబోయే ఎన్నికల్లో అంతకు మించి ఆదరణ దొరుకుతుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మైకుల ముందుకు వచ్చారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఏపీలో ఎన్నికల సందర్భంగా రాజకీయ వేట ప్రారంభమైందంటూ వ్యాఖ్యానించారు. ఇక, బీజేపీ జగన్ కు అండగా ఉండదని.. అలాగని ఎవరికీ అండగా ఉండబోదని జీవీఎల్ స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వారి అసమర్థతకు అద్దం పడుతున్నాయనే కామెంట్లకు కారణమవుతున్నాయి.

తాజాగా ఏపీ రాజకీయాలపైనా… ఏపీ సర్కార్ పై బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలపైనా జీవీఎల్ స్పందించారు. విశాఖలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ విజయవంతమైందన్నారు. ఆ సభ లో ఏపీకి కేంద్రం ఏం చేసిందో చెప్పామని జీవీఎల్ తెలిపారు. అనంతరం… “జగన్ ప్రభుత్వ అవినీతిపై అమిత్ షా వ్యాఖ్యల్లో నిజం లేకపోతే.. వాటిపై సీబీఐతో విచారణ జరిగిపించాలని వైసీపీ కోరాలి” అని ఒక డైలాగ్ వేశారు! దీంతో కీబోర్డులకు పని చెబుతున్నారు నెటిజన్లు.

ఇక్కడ జీవీఎల్ సృహలో ఉండి గమనించాల్సిన విషయం ఏమిటంటే… కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపి. ఈ సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను బీజేపీ ఫుల్ గా వాడేస్తుందనే కామెంట్లు నిత్యం వినిపిస్తుంటాయి. బీజేపీ నేతలు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది నిజం అని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అలాంటి సమయంలో… ఏపీ సర్కార్ పై విమర్శలు చేసే బదులు… వారే సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించొచ్చు కదా!

పైగా… వారు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసి, ఈ విమర్శలపై సీబీఐ ఎంక్వరీ వేయండని తిరిగి వైసీపీ నేతలు బీజేపీ ని అడగాలని చెప్పడానికి మించిన అసమర్థ స్టేట్ మెంట్ మరొకటి ఉంటుందా? ఈ విషయాలు ప్రజలు గ్రహించరనే అతి తెలివితేటలతోనే జీవీఎల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తెలివితేటల వల్లే ఏపీలో బీజేపీ నోటాతో పోటీ పడుతుందని ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… ఏపీలో వచ్చే ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాదని చెప్పడం! ఎంత చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా… ఈసారి ఎన్నికల్లో గెలుపు తమదే అని చెప్పుకుంటూ, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తుంటాయి! కానీ అందుకు పూర్తి భిన్నంగా… రాబోయే ఎన్నికల అనంతరం తామే ప్రధాన ప్రతిపక్షం అవుతామని చెప్పడానికి మించిన జ్ఞానం ఉంటుందో లేదో జీవీఎల్ కే తెలియాలి!!