ఇద్దరు టీఆర్ఎస్ నేతలే. ఇద్దరు వేరే పార్టీల నుంచి టీఆర్ఎస్ కు వలస వచ్చిన వాళ్లే… ఒకరేమో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరొకరేమో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అంతా కలిసి పనిచేయాలని గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పినా… వీళ్ల మధ్య మాత్రం సఖ్యత కుదరడం లేదు. మొత్తానికి వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఖమ్మం టీఆర్ఎస్ లో కాక రేపుతున్నాయి. కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఫ్లెక్లీల తొలగింపు ఇరు వర్గాల మధ్య అగ్గిరాజేసింది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఖమ్మం వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని ఆయన వర్గం నిర్వహించింది. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి హడావిడి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలకు ఆర్డర్ కూడా ఇచ్చింది. మున్సిపల్ అధికారులను సంప్రదించి ముందస్తు అనుమతులు కూడా తీసుకుంది. అయితే ఇంతలో చేటుచేసుకున్న పరిణామాలు ఇరు వర్గాల మధ్య విభేదాలను మరింత ఎక్కువ చేశాయి. కొంత మంది ఆకతాయిలు నగరంలో ఆపాటికే ఏర్పాటు చేసిన పలు ఫ్లెక్సీలను చింపేశారు. దీనికి తోడు మున్సిపల్ ఉద్యోగులు సెలవుల్లో ఉండడంతో పొంగులేటి జన్మదినం సందర్భంగా ఆర్డర్ ఇచ్చిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే వీలులేకుండా పోయింది.
పువ్వాడ అజయ్ వర్గమే కావాలని ఇదంతా చేసిందని పొంగులేటి వర్గం భావిస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్ ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్నారు. పుల్ యాక్టివ్ గా ఉంటూ కార్యకర్తలను అందర్ని తనవైపుకు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే ఈ రకంగా ఆయన చేయించి ఉంటారని పొంగులేటి వర్గం ఆరోపిస్తోంది. అయితే ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని పువ్వాడ వర్గం చెప్తోంది.