ఎన్టీఆర్ కి షాకిచ్చిన కరాటే కళ్యాణి!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసిన కేసీఆర్ & కో లు ఖమ్మంలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావించారు. పైగా ఈ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ ని ముఖ్య అతిధిగా పిలవాలని ఫిక్సయ్యారు. ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా ఇంటికి వెళ్లి జూనియర్ ని ఆహ్వానించారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… విగ్రహ ఆవిష్కరణ తేదీ దగ్గరపడుతున్న సమయంలో కరాటే కళ్యాణి & కో… విగ్రహ ఆవిష్కరణకు అడ్డుతగులుతున్నారు.

మే 28న నందమూరి తారకరామారావు వందో జయంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు చేసుకునేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఖమ్మంలోనూ మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఖ్యాతిని ప్రతిబింబించేలా 54 అడుగులు విగ్రహాన్ని లకారం చెరువులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో రంగంలోకి దిగాయి హిందూ సంఘాలు. అవును… శ్రీ కృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహ ఏర్పాటుపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

తాజాగా సినీనటి కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో.. ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు హిందూ, యాదవ సంఘాల సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఎన్టీఆర్‌ కి విగ్రహం పెడితే అందరికీ సంతోషమే కానీ… కృష్ణుడు రూపంలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వారు చెబుతున్నారు. భవిష్యత్ తరాల పిల్లలు ఎన్టీఆర్‌ ని శ్రీకృష్ణుడు అనుకునే పరిస్థితి వస్తుందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక రాజకీయ ప్రయోజనం ఉందని వాదిస్తున్నారు. దీంతో… వ్యవహారం సీరియస్ అయ్యింది.

మరి ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. విగ్రహం ఏర్పాటు చేస్తారా.. లేక, వెనక్కి తగ్గుతారా.. లేదంటే ఆకారంలో మార్పుల చేస్తారా అన్నది వేచి చూడాలి!