ఇది “మా”(కుల) పౌరుషం..?

అవసరం ఉన్న చోట కంటే అనవసరమైన చోట కొంతమంది పౌరుషం చూపిస్తుంటారు! చిన్నవారిపై పెత్తనం చేసి వారి భుజాలు వారు చరిచేసుకుంటారు. శభాష్ శభాష్ అనేసుకుంటుంటారు! సమాజం చూస్తుంది.. విజ్ఞత అవసరం అనే ఆలోచనలు పక్కన పెట్టేస్తుంటారు! తాజాగా కరాటే కళ్యాణిని “మా” నుంచి సస్పెండ్ చేస్తూ “పెద్దలు మంచు విష్ణు” నిర్ణయం తీసుకున్నారు! రఘుబాబు భుజాలపై తుపాకీ పెట్టారు! ఫలితంగా… కరాటే కళ్యాణిపై రివేంజ్ తీర్చుకున్నారు!

కరాటే కళ్యాణి “మా” సభ్యత్వ రద్దు టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయంపై మెజారిటీ సభ్యులు పెదవి విరుస్తుండగా.. కాస్త కులగజ్జి ఉన్నవారు మాత్రం అహంకారంతో కూడిన స్మైల్ ఇచ్చి పోతున్నారు! ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించిన కారణంగా ఆమెకు ఈ శిక్ష పడింది. ఖమ్మంలో మే 28న శ్రీకృష్ణుడు అవతారంలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తలపెట్టారు. జూ.ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీన్ని యాదవ సంఘాలు వ్యతిరేకించాయి. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ… శ్రీకృష్ణుని అవతారంలో విగ్రహ ప్రతిష్ట చేయడం తగదన్నారు.

దీంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. అయితే… హైకోర్టు యాదవ సంఘాలకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు నిలిపివేయాలని స్టే ఆర్డర్ ఇచ్చింది. కరాటే కళ్యాణి ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఫలితంగా ఒక వర్గం నటులకు దూరం అయ్యారు! అవును… కరాటే కళ్యాణి ఒక బీసీ మహిళ కాబట్టే అన్యాయంగా శిక్షించారనే వాదన తెరపైకి వచ్చింది. కాస్త బుర్రపెట్టి ఆలోచిస్తే… కళ్యాణి చేసిన తప్పేంటో తడుము కోకుండా తెలుగులో చెప్పగలరో లేదో అనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి! ఇది పూర్తిగా కుల దురంహాకరపూరిత చర్యగా కొందరు అభివర్ణిస్తున్నారు!

ఎన్టీఆర్ నటుడు అయినప్పటికీ వివాదం సినిమా పరిశ్రమకు సంబంధించింది కాదు అనే విషయం “పెద్దలు” మరిచిపోతున్నారు! అదే సమయంలో కాస్త చెవులు పెట్టి వింటే… కరాటే కళ్యాణి ఎన్టీఆర్ కించపరుస్తూ ఎక్కడా మాట్లాడలేదు. ఎన్టీఆర్ దేవుడు కాదు, దేవుని రూపంలో విగ్రహ ఏర్పాటు తగదన్నారు. దీన్ని తప్పుగా పరిగణించి మంచు విష్ణు ఆమెపై చర్యలు తీసుకున్నాడు. ఇలాంటి దిక్కార చర్యలు “మా”లో గతంలో ఎప్పుడూ జరగలేదు పాపం!! పైగా ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కానేకాదు! ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉండటం మంచిదే కానీ… అది అన్ని విషయాల్లోనూ లేకపోవడం దారుణమే!

ఇప్పుడు ఎవరి ఆనందంకోసం, మరెవరి ఈగోకోసం, ఇంకెవరి ప్రాపకం కోసం కళ్యాణికి ఇంత శిక్ష విధించినట్లు? ప్రస్తుతం ఆన్ లైన్ వేదికగా “మా” పెద్దలకు ఈ ప్రశ్న ఎదురవుతుంది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ తో పాటు… చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ వంటి పెద్దలు ఈ విషయంపై స్పందించాలని కోరుతున్నారు సినీ అభిమానులు! చిరంజీవి – మోహన్ బాబు – బాలకృష్ణ వంటి పెద్దలు ఇలాంటి సంకుచిత మనస్కులు కాదనేది వారి అభిమానుల అభిప్రాయంగా ఉంది. మరి మంచు విష్ణు ఈ విషయంపై స్పందిస్తారా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో చూపని చిత్తశుద్ధి ఇలాంటి విషయాల్లో చూపించి మనుగడ కాపాడుకుంటున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆన్ లైన్ వేదికగా కనిపిస్తున్నాయి!!

మేమంతా ఒక కుటుంబం అని సినిమా డైలాగులు చెప్పే ఈ సినీ జనాలకు ఇక్కడ మాత్రం కల్యాణి కులం గుర్తొచ్చిందా…? ఒకే కుటుంబంలో కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయా? ఒకే ఇంట్లో చాలా కులాలు ఉన్న సినీ పెద్దలైనా సమాధానం చెబుతారో లేక, తామంతా “నటులము” అని చెప్పదలచుకుంటారో వేచి చూడాలి!