కేవలం తన సొంత కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీలో టీడీపీని నాశనం చేస్తున్నారని, భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని… టీడీపీలోనే కొంతమంది నాయకులు ఆఫ్ ద రికార్డ్ చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తుంటారు. అయినా.. ఈ విషయంలో బాబు ఏమాత్రం వెనక్కి తగ్గరు. పైగా… తన కుమారుడు లోకేష్ భవిష్యత్తుకు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ అడ్డొస్తాడోనని… నిత్యం తొక్కేస్తుంటారు. ఆఖరికి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా అసలు సిసలు వారసుడిని కనీసం ఆహ్వానించే సాహసం చేయరు. ఆ స్థాయిలో నారా ఫ్యామిలీకి.. జూనియర్ ఫీవర్ పట్టుకుంది. దీంతో… జూనియర్ సేవలను పరోక్షంగా పొందే పనికి పూనుకున్నారు బీఆరెస్స్ నేతలు.
ఇందులో భాగంగా… తెలంగాణలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 54 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది తెలంగాణ సర్కార్. ఆ విగ్రహావిష్కరణకు… నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించింది. అవును… ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి.
ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ విగ్రహా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన నివాసంలో కలిసి విగ్రహావిష్కరణ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లుపై చర్చించారు. ప్రత్యేకంగా ముఖ్య అతిధిగా రమ్మని ఆహ్వానించారు. దీంతో అసలు సిసలు నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
బేస్ మెంట్ తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్ మెంట్ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో.. రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవ చూపారు.
దీంతో… సరైన సమయంలో జూనియర్ ని బీఆరెస్స్ కరెక్ట్ గా వాడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆఖరికి తెలంగాణ టీడీపీ నేతలకు అయినా ఈ జ్ఞానం లేకుండాపోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి!