క‌రోనా పై తెలంగాణ‌ జోగిని స్వ‌ర్ణ‌ల‌త భవిష్య‌వాణి

ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి బెంబేలెత్తిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆరు నెల‌ల కాలం నుంచి ప్ర‌పంచం క‌రోనా గుప్పిట్లోనే బిక్కు బిక్కు మంటోంది. కోటికిపైగా దాటిన కేసులు..ల‌క్ష‌ల్లో మ‌ర‌ణాలు…అయినా క‌రోనా శాంతిచ‌లేదు. మహ‌మ్మారి ఇంకా ప్రాణాల్ని మింగేస్తూనే ఉంది. ఈ ప‌రిస్థితుల‌న్నింటిని కూట‌గ‌ట్టుకుని కొంత మంది ఇది ప్ర‌పంచ వినాశ‌న‌మంటున్నారు. యుగాంతం అంటున్నారు. 2020 లో యుగాంతం అని మీడియా ముందే హెచ్చ‌రించంద‌ని మ‌రింత భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టించే వారు లేక‌పోలేదు. మయాన్ కేలండర్ ప్రకారం 2012 అంటే 2020కి సమానం అని కూడా పుకార్లకు తెర‌లేచింది.

అయితే ఇదంతా క‌ట్టు క‌థ‌లు మాత్ర‌మేన‌ని అంత‌కు మించి బ‌ల‌మైన ప్ర‌చారం సాగుతోంది. ఇక్కడ ఎవ‌రు నిజం? ఎవ‌రు అబ‌ద్దం? అస‌లు ఈ ప‌రిస్థితికి కార‌ణం ఏంట‌న్న‌ది! ప‌క్క‌న‌బెడితే పల్లెల నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కూ ఇది యుగాంత‌మే అని ఓ పానిక్ సిచ్వేష‌న్ అయితే బ‌లంగా క‌లుగుతోంది. మెజార్టీ పీపూల్స్ యుగాంతానికే ఓటేయ్య‌డం విశేషం. ఇక ఆ విష‌యం ప‌క్క‌న‌బెడితే తెలంగాణ‌లో బోనాల పండుగ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల్లో భాగంగా రంగం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మ‌హంకాళి అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ల‌త‌ను ఆవ‌హించి భ‌విష్య‌వాణి వినిపించారు.

క‌రోనాపై ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ఎవ‌రు చేసుకున్న‌ది వారు అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌న్నారు. ఇది దైవ నిర్ణ‌య‌మ‌న్నారు. మ‌రిన్ని గడ్డు రోజులు ప్ర‌జ‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని జోస్యం చెప్పారు. త‌న ప్ర‌జ‌లంద‌ర్నీ కాపాడుకుంటాన‌ని చెప్పారు. గంగా దేవికి జ‌లాల‌తో అభిషేకం, బోనం చేయండ‌న్నారు. అమ్మ‌వారు క‌రుణించి ప్ర‌జ‌ల కోరిక‌లు తీరుస్తుంద‌న్నారు. ఐదు వారాల పాటు ప‌ప్పు, బెల్లంతో శాఖ‌లు స‌మ‌ర్పించాల‌న్నారు. మారు బోనం త‌ప్ప‌కుండా స‌మ‌ర్పించాల‌ని, ఎలాంటి ఆప‌ద రాద‌ని స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య వాణి వినిపించారు.