క్రిస్టియన్ వ్యతిరేకిగా ముద్ర, రాయలసీమ నుండి బెదిరింపులు.. రాఘురామరాజు కొత్త ట్విస్ట్

వివాదాస్పద ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు.  ఈ ఆరు పేజీల లేఖలో తనపై వస్తున్న ఆరోపణలకు చాలా చాకచక్యమైన వివరణ ఇచ్చారు ఆయన.  ఒకవైపు జగన్ ను పొగుడుతూనే తాను చేసిన ప్రతి చర్య, తాను మాట్లాడిన ప్రతి మాటలో తప్పేమీ లేదన్నట్టు తెలిపారు.  లేఖలో ప్రధానంగా తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద విజయసాయిరెడ్డిగారు షోకాజ్ నోటీసులు పంపారని, కానీ ఎన్నికల సంఘం సూచన మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడకూడదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరునే వాడాలని అన్నారు.  అలాగే పార్టీ క్రమశిక్షణ కమిటీ గురించి కూడా అడిగారు.  
 
 
ఇక టీటీడీ ఆస్తుల విక్రయం విషయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడానని, అలాగే బాద్యత గల ఎంపీగా నిర్భంధ ఇంగ్లీష్ విద్య సమంజసం కాదని తెలిపానని అంతేకానీ పార్టీకి, మీకు వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశ్యం తనకి లేదని అన్నారు.  ఇక బహిరంగంగా తాను మాట్లాడిన వ్యాఖ్యలను తప్పుడు కోణంలో చూపుతున్నారని అంటూ పార్టీ అనుకూల మీడియా తన మీద అసభ్యకర కథనాలను అల్లుతోందని తప్పుబట్టారు.  అన్నిటికన్నా లేఖలోని కొత్త విషయం ఏమిటంటే మీ చుట్టూ ఉన్న కోటరీ నాపై క్రిస్టయన్ వ్యతిరేకి అనే ముద్ర వేస్తోంది అంటూ రఘురామరాజు సీఎంకు తెలపడం. 
 
 
దీంతో పార్టీలో తనను ముఖ్యమంత్రికి దూరం చేసే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయని ఎంపీ బాహాటంగానే అన్నారు.  ఇక ఎంపీలకు విందు ఇచ్చిన విషయం మాట్లాడుతూ అందరికీ గోదావరి వంటలు, స్వీట్ల రుచులు చూపడానికి విందు ఇచ్చానని, దానికి ఒక్క బీజేపీ ఎంపీలే కాకుండా ఇతర ఎంపీలు కూడా హాజరయ్యారని క్లారిటీ ఇచ్చారు.  అంతేకాదు తన గెలుపులో 90 శాతం తన నాయకుడీ వాటా కాగా తనది 10 శాతం అని, సొంత నియోజకవర్గం ఎమ్మెల్యేనే శ్రేణులతో తిట్టించడం, దిష్టిబొమ్మలు తగులబెట్టించడం బాధ కలిగించింది అంటూ తనకు బెదిరింపు కాల్స్ ముఖ్యంగా రాయలసీమ నుండి ఇంకా ఇతర ప్రాంతాల నుండి రావడంతో కెంద్రా భద్రత కోరారని అన్నారు.  ఈ లేఖ చూస్తే కర్ర విరగదు, పాము చావదు అన్నంత లౌక్యంగా ఉంది.  మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.