కులం వాడకంలో వైసీపీ తక్కువేమీ కాదు 

Raghurama Krishnama Raju
ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీకి పెద్ద తలనొప్పిగా పరిణమించింది.  పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న అనేక వ్యవహారాలను ఆయన బహిర్గతం చేసేశారు.  ముఖ్యంగా కుల రాజకీయాల అంశంలో అధికార పక్షం తీరును బాహాటంగానే విమర్శించారు రఘురామరాజు.  ఆయన వరుసగా ప్రభుత్వం, అధిష్టానం నిర్ణయాల మీద, పాలనలో జరుగుతున్న అవినీతి మీద వైసీపీ వ్యతిరేక మీడియాలో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.  దీంతో వైసీపీ ప్రత్యర్థుల మీద ప్రయోగించే కాస్ట్ ఆయుధాన్ని ప్రయోగించారు. 
 
రఘురామరాజు అన్ని విమర్శలు చేసినా పార్టీ పెద్దలు ఒక్క మాట మాట్లాడలేదు కానీ నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు గట్టిగా స్పందించారు.  జగన్ మూలంగానే రఘురామరాజుకు పార్లమెంట్ కమిటీ చైర్మన్ పదవి దక్కిందని అన్నారు.  దీంతో రాఘురామరాజు అనేక ఆసక్తికర విషయాలను బహిర్గతం చేశారు.  తనను విమర్శించడానికి తన కులానికే చెందిన తన ప్రియ మిత్రుడు ప్రసాదరాజును వాడుతున్నారని, అది వైసీపీ పాలసీ అని అనేశారు ఆయన.  తన విషయంలోనే కాదు పవన్ కళ్యాణ్ ను తిట్టాలన్నా ఆయన కులానికి చెందిన నేతలతోనే తిట్టిస్తారని వ్యాఖ్యానించారు. 
 
ఆయన మాటలతో గతంలో పవన్ మాట్లాడిన మాటలు గుర్తుకొస్తున్నాయి.  గతంలో పవన్ వైసీపీ నేతలు తనను విమర్శించడం గురించి మాట్లాడుతూ వైసీపీ తనను తిట్టాలంటే కేవలం కాపు నేతలనే వాడాల్సిన అవసరం లేదని వేరే సామాజిక వర్గం నేతలతో కూడా తిట్టించవచ్చని, తనను తిడితే కాపు ఓట్లు పోతాయనే భయం వైసీపీకి అవసరం లేదని అన్నారు.  అప్పుడు పవన్, ఇప్పుడు రఘురామరాజు మాటల్ని బట్టి వైసీపీ కులం కార్డును ఎలా వాడుకుంటుందో స్పష్టమైంది.  మాటకు ముందు ప్రత్యర్థి పార్టీలను అన్నిటికీ కులం రంగు పులుముతున్నారని దుయ్యబట్టే వైసీపీ నేతలు ఈ విమర్శలను ఎలా తిప్పికొడతారో, వాటికి ఎవరిచేత సమాధానం చెప్పిస్తారో చూడాలి.