ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధ్యక్ష పదవి ముళ్ల కిటీటమే మరి

గత కొన్నిరోజులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కొత్తవారిని ఎంపిక చేస్తారనే వార్తలు జోరుగా వినబడుతున్నాయి.  ప్రధానంగా శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పేరు అధ్యక్ష పదవి రేసులో వినబడుతోంది.  గత ఎన్నికల ఓటమి నేపథ్యంలో యువ న్యాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన చంద్రబాబు రామ్మోహన్ నాయుడు అయితే బాగుంటుందని భావించారట.  రామ్మోహన్ నాయుడుకి మంచి వాక్ చాతుర్యం ఉంది.  విషయ పరిజ్ఞానం ఉంది.  ఎర్రన్నాయుడి కుమారుడిగా ప్రజల్లో మంచి ఆదరణ ఉంది.  అందుకే రాష్ట్ర అధ్యక్ష పదవికి అతనే సరైన ఆప్షన్ అని బాబుగారు భావించారు.  
 
కానీ ఇంతలోపే వైసీపీ నేత విజయసాయి రెడ్డి రామ్మోహన్ నాయుడికి పదవి ఇవ్వడం లోకేష్ కు ఇష్టం లేదని, తనకు ఇవ్వనందుకు అలిగి కూర్చున్నారని వ్యాఖ్యలు చేశారు.  ఇవి టీడీపీలో కొంత అలజడిని క్రియేట్ చేశాయి.  అవి చాలవన్నట్టు తాజాగా కీలక నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్టులతో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి.  వైసీపీ సర్కార్ వైఖరి చూస్తుంటే ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడతారో తెలీని పరిస్థితి.  పైకి గంభీరంగా మాట్లాడుతున్నా చాలామంది నేతలు లోపల గుబులుగానే ఉన్నారు. 
 
చంద్రబాబు నాయుడికి సైతం ఏమీ పాలుపోని పరిస్థితి.  ఇక ఈ అరెస్టుల వ్యవహారాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం కష్టమని, న్యాయస్థానాల ద్వారానే ఉపశమనం పొందాలని చూస్తున్నారు.  ఈ పరిస్థితిని ఒకరకంగా సంక్షోభం అనే అనుకోవాలి.  ఈ సంక్షోభంలో రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే ముళ్ల కిరీటమే అవుతుంది.  అధ్యక్షుడు అంటే అన్ని వ్యవహారాలకీ ముందుండాలి.  ప్రతి నాయకుడినీ వెనకేసుకుని రావాలి.  అధికార పక్షంతో ఢీ అంటే ఢీ అనాలి.  ప్రజెంట్ సిట్యుయేషన్లో అవన్నీ చాలా కష్టమైన పనులు.  కాబట్టి ఒకవేళ చంద్రబాబు పదవిని తీసుకోమని ఆఫర్ చేస్తే అది రామ్మోహన్ నాయుడికి ముళ్ల కిరీటాన్ని అందుకోవడమే అవుతుంది.  మరి అవకాశం వస్తే రామ్మోహన్ నాయుడు ధైర్యం చేసి పదవిని అందుకుంటారో లేకపోతే వెనక్కి తగ్గుతారో చూడాలి.