ఆసక్తిగా సీమ రాజకీయం.. జేసీ ఫ్యామిలీకి బూస్ట్

అనంతపురం రాజకీయాల్లో జేసీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది.  ఫ్యాక్షన్ నేపథ్యం నుండి రాజకీయాల్లొకి వచ్చిన జేసీ కుటుంబానికి అనంతపురం జిల్లాలో మంచి పట్టుంది.  తాడిపత్రి నియోజకవర్గం నుండి వరుసగా 2004, 2009, 2014 లో ఈ జేసీ సోదరులే ఎమ్మెల్యే పదవిలో నెగ్గుతూ వచ్చారు.  వారు ఏ పార్టీలో చేరినా తాడిపత్రి జనం గెలిపిస్తూనే వచ్చారంటే వారి ప్రాభవం ఆ నియోజకవర్గంలో ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు.  ఆ ఒక్కచోటే కాదు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా జేసీ కుటుంబానికి అనుచరులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 
 
కానీ 2014 తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు వారి ప్రాభవాన్ని కొద్దిగా తగ్గించాయి.  పైగా కొన్నేళ్లుగా జేసీ బ్రదర్స్ రాజకీయాల్లో పెద్దగా ఉత్సాహం కనబర్చలేదు.  వారి వారసులు సైతం ఎక్కువగా వ్యాపారాల మీదే దృష్టి పెట్టారు.  వీటికి తోడు టీడీపీ మీదున్న వ్యతిరేకత కూడా కలిసి 2019 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి వైకాపా అభ్యర్థి చేతిలో 7500 ఓట్ల తేడాతో ఓడిపోయారు.  అప్పటివరకు దివాకర్ రెడ్డి లేదా ప్రభాకర్ రెడ్డిలలో ఎవరో ఒకరు ఎన్నికల్లో నిలబడుతూ వచ్చారు.  కానీ ఎలాంటి గ్రౌండ్ వర్క్ లేకుండా ప్రతికూల పరిస్థితుల నడుమ వారసుడు అస్మిత్ రెడ్డిని బరిలో నిలపడంతో ఓటమి తప్పలేదు.  
 
ఈ ఓటమితో జేసీ ఫ్యామిలీ సీమ రాజకీయాల్లో మరింత వెనకబడిపోయింది.  ఎలా పైకి లేవాలో కూడా వారికి తెలియలేదు.  ఇలాంటి తరుణంలోనే ప్రభుత్వం వ్యాపారాల విషయంలో వారిపై వరుస కేసులు పెట్టడం స్టార్ట్ చేసింది.  అయినా మౌనంగా ముందస్తు బెయిల్స్ తీసుకుంటూ వచ్చిన జేసీ ఫ్యామిలీ ఒక్కసారే ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను నకిలీ పత్రాల స్కాములో అరెస్ట్ చేయడంతో అలర్ట్ అయింది.  రాజకీయంగా మునుపటి స్పీడ్ అందుకుంటేనే తమని తాము కాపాడుకోగలమని భావించి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుచరగణాన్ని, మిత్రులైన రాజకీయ శక్తుల్ని యాక్టివ్ స్టేట్లోకి తీసుకొచ్చే పని మొదలుపెట్టారు.  జనం సైతం జేసీ ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు.  ఈ పరిణామాలన్నీ సీమలో తిరిగి నిలబడటానికి జేసీ ఫ్యామిలీకి ఒక అవకాశం ఇచ్చినట్టే కనబడుతోంది.