అచ్చెన్నాయుడి అరెస్టుకు కులం రంగు బాగా పులిమారు

టీడీపీ ముఖ్య నేత అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు ఉన్నపళంగా అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం శ్రేణులు ఖంగుతిన్నాయి.  ఏమాత్రం ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగిన ఈ ఘటనతో చంద్రబాబు అండ్ కో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  పార్టీకి ముఖ్యమైన వ్యక్తిని కాపాడుకోవడం భాద్యత కాబట్టి చేసేది లేక చంద్రబాబు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు.  రంగంలోకి దిగడమంటే అచ్చెన్నాయుడు, తన ప్రభుత్వం అవినీతికి పాల్పడలేదని నిరూపించే ఆధారాలతో కాదు కులం పేరుతో.  ఇది బాబుగారి ఎవర్ గ్రీన్ ఫార్ములా. 
 
ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టాలన్నా, తమని తాము కాపాడుకోవాలన్నా బాబుగారు కులం ప్రస్తావన ఖచ్చితంగా తెస్తారు.  అరెస్ట్ గురించి తెలిసిన వెంటనే  అచ్చెన్నాయుడిని బీసీ ఉద్దారకుడిగా మార్చేశారు బాబు.  బీసీల తరపున ప్రశ్నించినందుకే జగన్ కక్ష సాధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.  టీడీపీ నేతలు వర్ల రామయ్య, చింతమనేని, రామ్మోహన్ నాయుడు, కొల్లు రవీంద్ర ఇలా పేరున్న లీడర్లంతా బీసీ నేతను అక్రమంగా అరెస్ట్ చేస్తారా అంటూ నిరసన స్పీచులు ఇచ్చేస్తున్నారు.  
 
ఒక్కసారిగా బీసీల పాలిట దేవుడిగా మార్చబడిన అచ్చెన్నాయుడు తాము అధికారంలో ఉండగా వారికి కొత్తగా ఎలాంటి మేలు చేశారో టీడీపీ నేతలు చెప్పాలి.  కానీ చెప్పట్లేదు.  పైగా బీసీలను రాజకీయంలోకి లాగి లబ్ది పొందాలని చూస్తున్నారు.  ఒకవేళ జగన్ నిజంగానే అన్యాయంగా అచ్చెన్నాయుడును ఈఎస్ఐ కేసులో ఇరికించారని అనుకున్నా దానికీ తగిన ఆధారాలను టీడీపీ చూపాలి.  తమ హయాంలోనే కుంభకోణం జరిగిందనే ఆరోపణ ఉంది కాబట్టి ఆ కుంభకోణంలో తమ భాగస్వామ్యం లేదని చంద్రబాబుగారు రుజువులు చూపాలి.  వాటితో న్యాయ పోరాటం చేయాలి.  అంతేకానీ ఇలా తమ నేతల మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు బాబుగారు, ఆయన అనుకూల యాల్లో మీడియా కులం రంగు పులమడం సబబు కాదు.