వైకాపాను పక్కకు తోసి టీడీపీని అక్కున చేర్చుకుంటున్న బీజెపీ  

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాకచక్యమైన రాజకీయాలు చేస్తోంది.  అధికార, ప్రతిపక్ష పార్టీలతో అటు స్నేహం లేకుండా, ఇటు శతృత్వం పెట్టుకోకుండా రెండు పడవల మీద స్వారీ చేస్తోంది.  ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న భాజపా అవసరమైనప్పుడు టీడీపీ లేదా వైసీపీతో ప్రయోజనం పొందేలా ప్రవర్తిస్తూ వచ్చింది.  ప్రాంతీయ పార్టీల అండ లేకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఏం చేయలేమనే నిజం భోధపడి మోదీ ఈ స్ట్రాటజీ ఫాలో అవుతూ వచ్చారు.  అయితే ఉన్నట్టుండి ఈ స్ట్రాటజీలో కొద్దిగా మార్పు కనిపిస్తోంది.  భాజపా నిదానంగా ఒక సైడ్ తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. 
 
అందుకు నిదర్శనమే పోలవరం విషయంలో టీడీపీకి కేంద్రం నుండి క్లీన్ చీట్ రావడం.  పోలవరం ప్రాజెక్టులో టీడీపీ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రం తేల్చింది.  దీంతో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.  బాబుతో పొత్తు తెగదెంపులు చేసుకున్నాక బీజేపీ పోలవరంలో భారీ అవినీతి జరిగిందని, ప్రాజెక్ట్ నిధులను బాబు ఏటీఎం తరహాలో వాడుకున్నారని ఆరోపణలు గుప్పించారు.  వైసీపీ సైతం అధికారంలోకి వచ్చాక బాబు హయాంలో భారీ అవినీతి జరిగిందని అంటూ రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా రెండు వేల కోట్లు మిగిల్చామని, బాబు పాలనలో తట్ట మట్టి కూడా ఎత్తలేదని చెప్పుకుంటోంది. 
 
కానీ భాజపా తాజాగా ఇచ్చిన క్లీన్ చీట్ కారణంగా వైసీపీ వాదనకు చెక్ పడినట్లయింది.  అంతేకాదు ఇటీవల కాలంలో వైసీపీ విధానాలను భాజపా పెద్ద ఎత్తున విమర్శిస్తోంది.  మొన్నామధ్య వర్చ్యువల్ ర్యాలీ నిర్వహించి నిర్మలా సీతారామన్, జీవీఎల్ నరసింహరావులు వైసీపీ పాలన మీద నిప్పులు చెరిగారు.  అంతకుముందు రాంమాధవ్ సైతం వైసీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.  ఇక వైసీపీకి పెను సవాల్ అయిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో భాజపా కీలక నేతలు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.  ఈ పరిణామాలన్నీ చూస్తే భాజపా డబుల్ స్టాండ వదిలి సింగిల్ స్టాండ్ తీసుకుంటోందా, భవిష్యత్తులో టీడీపీతో పొత్తు కోసం రూట్ క్లియర్ చేసుకుంటోందా అనే అనుమానం కలుగుతోంది.