వైఎస్ జగన్ దృష్టి పెడితే ఎవరి లైఫ్ అయినా మారాల్సిందే. జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో వైసీపీలో నాయకులుగా ఎదిగిన యువకులు చాలామందే ఉన్నారు. వారిలో దేవినేని అవినాష్ కూడ ఒకరు. దేవినేని నెహ్రు తర్వాత ఆయన కుమారుడు దేవినేని అవినాష్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడలో పోటీచేసి ఓడిపోయారు. అవినాష్ విజయవాడ తూర్పు టికెట్ అడిగితే బాబుగారు పట్టుబట్టి గుడివాడ నుండి పోటీకి దింపి ఆయన ఓటమికి ప్రధాన కారణం అయ్యారు. పైగా అక్కడి టీడీపీ నాయకులు తన గెలుపు కోసం నిజాయితీగా పనిచేయలేదనే అభిప్రాయం అవినాష్ లో ఉంది.
దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. అవినాష్ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు తూర్పు నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. దీంతో అవినాష్ జోష్ అనుకున్నారు. ఓడిన నియోజకవర్గంలోనే పదవి లేకపోయినా పాలన మాదే అన్నట్టు ఉన్నారు. ప్రభుత్వం తరపున జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ చక్కబెట్టేస్తున్నారు. అవినాష్ వేగం ముందు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నా డమ్మీ అయిపోయారట. అవినాష్ రాకతో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు పూర్తి సంతృప్తిగా ఉన్నారు. టీడీపీ నుండి వచ్చిన నేతల్లో వైసీపీలో బాగా కుదురుకుపోయినది ఒక్క అవినాష్ మాత్రమే. అతి తక్కువ సమయంలోనే అవినాష్ ఇలా పార్టీను నిలబెట్టడం, శ్రేణుల అభిమానాన్ని సంపాదించుకోవడం జగన్ కు బాగా నచ్చింది.
ఇక జగన్ ఇంప్రెస్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు కదా. నిత్యం అవినాష్ మీద ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారట. అతనికి ప్రభుత్వంలోని నాయకులు, అధికారులు వేగంగా స్పందించేలా ఏర్పాట్లు చేశారట. ఇంకేముంది తూర్పు నియోజకవర్గానికి కావాల్సిన నిధులు క్రమ తప్పకుండా వెళ్ళిపోతున్నాయట. అన్నింటినీ అవినాషే దగ్గరుండి చూసుకుంటున్నారట. అయితే ఇప్పుడు జగన్ అవినాష్ మీద ఇంకో బాధ్యత పెట్టబోతున్నారని టాక్. అదే విజయవాడ పార్లమెంటరీ పగ్గాలు అప్పజెప్పడం. గత ఎన్నికలో విజయవాడ ఎంపీ స్థానం నుండి కేశినేని గెలుపొందారు. ఎన్నికల తర్వాత నానిని ఢీకొట్టి లోక్ సభ స్థాయిలో చక్రం తిప్పగల నాయకుడు ఇప్పటివరకు వైసీపీకి దొరకలేదు.
ఆ స్థానం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఈలోపు అవినాష్ మీద పూర్తిగా నమ్మకం కుదరడంతో జగన్ అతన్ని అసెంబ్లీ స్థాయి నుండి పార్లమెంట్ స్థాయిలో పెట్టాలని అనుకుంటున్నారట. రేపో మాపో ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావొచ్చు. ఈ పదవే గనుక దక్కితే అవినాష్ దశ తిగినట్టే. బెజవాడలో మరోసారి దేవినేని ఫ్యామిలీ ప్రభావం కనబడుతుంది.