ప్రస్తుత కాలంలో మన దేశం సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందింది. ఇలా టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల ప్రపంచంలో నరుమూలల్లో జరుగుతున్న విషయాలను ఒకచోట కూర్చొని తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఎంత పెద్ద సమస్య అయినా కూడా టెక్నాలజీ వల్ల చిటికెలో సొల్యూషన్ కనిపెడుతున్నారు. ఇలా దేశం రోజురోజుకీ ఎంత అభివృద్ధి చెందినా కూడా అక్కడక్కడ దేశంలో మూఢనమ్మకాలు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. టెక్నాలజీ అందిపుచ్చుకొని కొత్త జీవితం కోసం ఎంతోమంది పరిగెడుతుంటే మరి కొందరు మాత్రం మూఢనమ్మకాలను నమ్ముతూ ఇంకా పూర్వకాలంలోనే జీవిస్తున్నారు.
మారుమూల ప్రదేశాలు, గ్రామాలలో ఉండేవారు మూఢనమ్మకాలను నమ్మటమే కాకుండా విద్యావంతులైన ఉపాధ్యాయులు కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మటం ఇప్పుడు చర్చనీయంగా మారింది. పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైతే వారికి దయ్యం పట్టిందని మాంత్రికుని పిలిపించి ఉపాధ్యాయులు వైద్యం చేయించిన ఘటన సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే..ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లా లోని కన్య ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం చేశాక.. 15 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే ఆ పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా పిల్లలకు ప్రాణాపాయం తప్పింది.
అంతటితో ఆగకుండా ఆ స్కూల్ యాజమాన్యం మాంత్రికుడిని పిలిపించి పిల్లల అనారోగ్యానికి గురి కావడానికి పాఠశాలలో ఉండే దెయ్యమే కారణమని తాంత్రికుడితో ఉపశయనం చేయించారు. అయితే అనారోగ్యానికి గురైన బాలికల వయస్సు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇలాంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే దయ్యం పట్టిందని మాంత్రికుడిని పిలిపించి మూఢనమ్మకాలను విద్యార్థులపై రుద్దటంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం పిల్లలు తిన్న నమూనాలను పరీక్షకు పంపించారని.. వాటి రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.