ఈ మధ్యకాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా చిన్న, పెద్ద, ముసలి, ముతక అనే బేధం లేకుండా అందరినీ వేదిస్తున్న సమస్య గుండె పోటు. ఈ సమస్య వలన వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా గుండె పోటుకు గురై ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు. దేశంలో గుండె పోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలా హఠాత్తుగా గుండెపోటు రావడం వల్ల అప్పటికప్పుడు వారిని కాపాడలేక ఎంతోమంది కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక స్కూల్ బస్సు నడుపుతున్న డ్రైవర్ కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. బస్సులో ఉన్న బాలిక అప్రమత్తం అవడంతో పెను ప్రభావం తప్పింది. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ లో సంభవించింది.
వివరాలలోకి వెళితే..శనివారం ఉదయం ఒక స్కూల్ బస్సు విద్యార్థులతో వెళుతుండగా బస్సు గోండాల వద్దకు చేరుకోగానే డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. గుండెపోటుతో డ్రైవర్ ఇబ్బంది పడటం భార్గవి అనే విద్యార్థిని గమనించింది. ఆమె జరగబోయే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికీ ప్రమాదం జరగకుండా వెంటనే స్టీరింగ్ ను అదుపు చేసి పక్కనే ఉన్న కరెంట్ పోల్ కి బస్ గుద్దుకునేలాా చేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పి బస్సులో ఉన్న విద్యార్థులందరూ క్షేమంగా బయటపడ్డారు.
స్కూల్ బస్ కరెంట్ పోల్ కి గుద్దుకోవడం గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా.. గుండె నొప్పితో బస్ డ్రైవర్ ఇబ్బంది పడటం గమనించారు. దీంతో బస్ డ్రైవర్ ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో బస్సు డ్రైవర్ ని ఆస్పత్రిలో చేర్పించడం వల్ల ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భార్గవి అనే విద్యార్థిని చాక చక్యం గా వ్యవహరించడం తో తన తోటి విద్యార్థులతో పాటు డ్రైవర్ ప్రాణాన్ని కాపాడింది. భార్గవి చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.