కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే దానిపై ప్రతిష్టంభన నెలకొంది. మెరీనా బీచ్ లో అన్నాదురై స్మారకం పక్కనే కరుణ అంత్యక్రియలు జరపాలని డిఎంకె పట్టుబడుతోంది. ఇందుకోసం స్టాలిన్ సీఎం కి లేఖ రాశారు. మెరీనాలో అంత్యక్రియలకు అనుమతివ్వమని పళని స్వామి ప్రభుత్వం స్పష్టం చేసింది. మెరీనా బీచ్ లో అంత్యక్రియలకు న్యాయ పరమైన చిక్కులున్నాయని అందుకే ఎట్టి పరిస్థితిలో అనుమతించమని చెప్పటంతో డిఎంకె నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం సర్ధార్ వల్లాభాయ్ పటేల్ రోడ్డులో గల గాంధీ మండపం దగ్గర రెండు ఎకరాల స్థలం కేటాయించింది.
తాత్కాలిక న్యాయమూర్తి కులువాడి రమేష్ మంగళవారం రాత్రి 11.30 గంటలకు ఈ వివాదంపై విచారణ ప్రారంభించి అర్ధరాత్రి వరకు విచారణ సాగించి ఎటు తేల్చలేక బుధవారం ఉదయం ఉదయం 8 గంటలకు వాయిదా వేశారు. మెరీనాలో నే కరుణ అంత్యక్రియలు జరపాలని రజనీకాంత్, రాహుల్ గాంధీలు డిమాండ్ చేశారు.
అన్నా సమాధి వద్ద కరుణా నిధి సమాధి ఏర్పాటుకు అవకాశం ఉందని, తాము వేసిన కేసుల్ని సాకుగా చూపి ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడాన్ని తాము ఖండిస్తున్నామని జయ స్మారక నిర్మాణంపై కేసు వేసిన న్యాయవాదులు బాలు, దురైస్వామిలు తెలిపారు. తాము వేసిన కేసుల వల్ల ఇబ్బంది అయితే వాటిని వెనక్కి తీసుకుంటామని వారు ప్రకటించారు. దీంతో న్యాయస్థానం ముందు జోరుగా వాదనలు కొనసాగాయి. కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.