ప్రాణ స్నేహితులు MGR కరుణానిధి బద్ధ శత్రువులు అవటానికి కారణం ఇదే

దేశరాజకీయాలలో కరుణానిధి, ఎంజి రామచంద్రన్ ల మధ్య వైరం చాలా తీవ్రంగా ఉండేది. వైరానికి వాళ్లిద్దరు ప్రతిరూపాలు. కరుణానిధి డిఎంకె, ఎంజిఆర్ ఎఐడిఎంకె ల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గున మండే రాజకీయాలు వాళ్లవి. వాళ్ల మధ్య మాటలు లేవు, పలకరింపులు లేవు. ఒకే ఐడియాలజీ, ఒకే సామాజిక లక్ష్యం సామాజిక న్యాయం, ద్రవిడ రాజకీయాలు. ఒకే రాజకీయ నేపథ్యం ఉన్న వారి మధ్య ఇలా ఇంత బద్ధ వైరం రావడానికి కారణం వీరిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన. అయితే, ఇక్కడ ఈ శత్రుత్వానికి ముందు ప్రగాఢమయిన అనుబంధం కూడా ఉండింది. వారిరువురు ఆగర్భ శత్రవులు కాదు. జీవితంలో విజయవంతమయ్యేందుకు ఎంతగానో పరస్పరం సహకరించుకున్న చరిత్ర వారిది. ఎంజి రామచంద్రన్ తొలినాళ్ల హిట్ చిత్రాలకు స్క్రిప్టు రాసింది కరుణానిధే.

అలాగే, కరుణానిధి మొదట ముఖ్యమంత్రి అయింది ఎంజి రామచంద్రన్ సహకారంతోనే. అది ఎలాగంటే…1967లో అణ్ణాదురై క్యాబినెట్ లో కరుణానిధి పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి అయ్యారు. 1969లో క్యాన్సర్ వ్యాధితో అకాల మరణం చెందారు. అపుడు అణ్ణా వారుసుడెవరు అనే ప్రశ్న వచ్చింది. నిజానికి అపుడు క్యాబినెట్ లో సెకండ్ ఇన్ కమ ాండ్ కరుణానిధి కాదు, వి ఆర్ నెడుంజెళియన్, నెడుంజెళియన్ కూడా పెద్ద మేధావియే. 1969న ఫిబ్రవరి మూడో తేదీన ఆయన్ని తాత్కాలిక ముఖ్యమంత్రిగా కూడా ఎన్నుకున్నారు. డిఎంకె పార్టీలో కూడా వర్గాలున్నాయి. అపుడు నెడుంజెలియన్ ని కాదని అన్నాదురై వారసుడిగా కరుణానిధి ముఖ్యమంత్రి కావాలి అనుకున్నారు. అందుకోసం ఎంజి రామచంద్రన్ చక్రం తిప్పారు. అన్ని గ్రూపులను దారికి తెచ్చి కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యేందుకు బాట వేశారు.

అప్పటివరకు సజావుగా సాగిన వీరి స్నేహబంధానికి 1971 లో వైరం మొదలయ్యింది. 1971 లో జరిగిన ఎన్నికల ఖర్చు చెప్పమని కరుణానిధిని కోరాడు ఎంజీఆర్. రామచంద్రన్ అలా అడగటం కరుణానిధికి నచ్చలేదు. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఎంతలా అంటే తాను సీఎం అవటానికి కారణమైన ఎంజీఆర్ ని కరుణానిధి డీఎంకే పార్టీ నుండి తొలగించేసాడు. పార్టీ నుండి బయటకి వచ్చిన ఎంజీఆర్ “ఆల్ ఇండియా డీఎంకే(ఏఐడీఎంకే)” పార్టీని స్థాపించారు. ఆ తర్వాత దిండిగల్ లోక్ సభ సీటుకు బై ఎలెక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికలలో ఏఐడీఎంకే నెగ్గింది. ఎంజీఆర్ కి ఆ ఎన్నికల ఫలితం ప్రభావం ఎంతలా కలిసొచ్చిందంటే..1977 ఎన్నికల్లో కరుణానిధిని ఓడించి ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నారు ఎంజీఆర్.