రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ ఎండీ, డైరెక్టర్ల పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 రోజుల్లోగా కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు బుధవారం హెచ్చరించింది. ఇన్వెస్టర్ల నుంచి ఆమ్రపాళి గ్రూపు కంపెనీలు రూ.2765 కోట్లను వసూలు చేసి దారి మళ్లించాయన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇన్వెస్టర్ల నుంచి సొమ్ము వసూలు చేసి ఇళ్ల నిర్మాణం లో జాప్యం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. గ్రూపు సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించకుండా కోర్టుతో ఆటలాడుకుంటున్నారా అని ధర్మాసనం మండిపడింది. 15 రోజుల్లోగా ఆమ్రపాలి డైరెక్టర్ల, ఎండీల స్థిర చరాస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. వేల మందిని నిరాశ్రయులను చేయాలని చూస్తోన్న సంస్థ వారిని నిరాశ్రయుల్ని చేసేందుకు వడ్డీతో సహా సొమ్మును వసూలు చేసేందుకు కోర్టు ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా సిద్దంగా ఉందని ఘాటుగా హెచ్చరించింది.