పోలీసుల సహకారంతో శబరిమల ఆలయంలో ప్రవేశించిన ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఘటన నేపథ్యంలో కేరళ అట్టుడికిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో మహిళ శబరిమల ఆలయంలోకి ప్రవేశించారు. 18 మెట్లు ఎక్కి, అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆమె పేరు శశికళ. వయస్సు 43 సంవత్సరాలు. ఆమె మన దేశీయురాలు కాదు. అయ్యప్పను దర్శించడానికి శ్రీలంక నుంచి వచ్చారు.
శశికళ అయ్యప్ప స్వామిని దర్శించినట్లు స్థానిక పోలీసులు కూడా ధృవీకరించారు. గురువారం రాత్రి 9:45 నిమిషాల సమయంలో ఆమె అయ్యప్పను దర్శించుకుని, 11 గంటలకు పంపా తీరానికి చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆలయ సంప్రదాయం, నిబంధనలకు విరుద్ధంగా స్వామివారి దర్శనం చేసుకున్న మూడో మహిళ ఆమె. శశికళ నుంచి శ్రీలంక ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్ట్ ఉందని, 1972లో ఆమె జన్మించినట్లు రికార్డయి ఉందని పోలీసులు తెలిపారు.
ఆలయంలోకి ప్రవేశించిన సమయంలో శశికళ వెంట ఓ మహిళా కానిస్టేబుల్ సహా ముగ్గురు పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. మహిళా కానిస్టేబుల్ సివిల్ డ్రెస్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే బిందు, కనకదుర్గ అనే ఇద్దరు 40 ఏళ్ల వయస్సున్న మహిళలు మొదటిసారిగా శబరిమల ఆలయంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. మహిళలకు కూడా శబరిమల ఆలయ ప్రవేశాన్ని కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఇచ్చిన తరువాత ఆయా సంఘటనలు చోటు చేసుకున్నాయి.