Dunith Wellalage: శ్రీలంక క్రికెటర్ కుటుంబంలో తీవ్ర విషాదం.. అప్ఘాన్ క్రికెటర్ షాక్

Dunith Wellalage

శ్రీలంక క్రికెటర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆసియాకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించింది. దీంతో సూపర్ 4కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో లంక బౌలర్ దునిత్ వెల్లలాగే తండ్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయం మ్యాచ్ జరుగుతున్నప్పుడు శ్రీలంక మేనెజ్‌మెంట్‌కు తెలిసింది. అయితే ఈ విషాద వార్త వెల్లలాగేకు చెప్పలేదు. మ్యాచ్ ముగిసిన అనంతరం హెడ్ కోచ్ సనత్ జయసూర్య తెలియజేశాడు. దీంతో తీవ్ర ఆవేదనలో ఉన్న దునిత్‌ను జయసూర్యతో పాటు తోటి క్రికెటర్లు ఓదార్చారు. అనంతరం హుటాహుటిన స్వదేశానికి దునిత్ బయలుదేరారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల న‌ష్టానికి 169 పరుగులు చేసింది. మహమ్మద్ నబీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లతో 60 ప‌రుగులు బాదాడు. చివరి ఓవర్ వేసిన లంక స్నిన్నర్ వెల్లలాగే బౌలింగ్‌లో నబీ ఊచకోత కోశాడు. వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఓ రిపోర్టర్ ఈ విషయాన్ని నబీకి తెలిపాడు. దీంతో షాక్‌కు గురైన నబీ తన సంతాపాన్ని తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అనంతరం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లలాగేకు ధైర్యం చెప్పాడు. దునిత్‌తో పాటు అత‌డి కుటుంబానికి హృద‌య‌పూర్వ‌క సానుభూతిని తెలియ‌జేశాడు.

ఇక ఈ మ్యాచ్‌ విషయానికొస్తే అఫ్గాన్ 169 ప‌రుగులు సాధించింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ న‌బి 60, ఇబ్ర‌హీం జ‌ద్రాన్ 25, ర‌షీద్ ఖాన్ 24 పరుగులు చేశారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో నువాన్‌ తుషార నాలుగు వికెట్లు, దునిత్ వెల్లలాగే, చ‌మీర‌, శ‌న‌క‌లు త‌లా ఓ వికెట్ తీశారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లంక బ్యాటర్లు ధాటిగా ఆడారు. కుశాల్ మెండీస్ (74) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. కుశాల్ పెరీరా(28), మిందు మెండిస్(26) పరుగులతో రాణించారు. దీంతో 18.4 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ ఛేదించింది. అఫ్గాన్ బౌల‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ త‌లా ఓ వికెట్ సాధించారు.