Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే చివరగా వచ్చిన పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. అదే ఊపుతో ఇప్పుడు మరిన్ని సినిమాలలో నటిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ మూవీలో బన్నీ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్గా నటించనుంది అంటూ మూవీ మేకర్స్ ఇటీవలే అధికారికంగా కూడా ప్రకటించారు.
అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడనే టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలు కానున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మలయాళం లో చిన్న సినిమాతో సంచలనం సృష్టిస్తున్న దర్శకుడికి అవకాశం ఇచ్చారట అల్లు అర్జున్. అట్లీ సినిమా తర్వాత బన్నీ మలయాళంలో సంచలనాలు సృష్టిస్తోన్న యంగ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నాడట.
ప్రస్తుతం మలయాళంలో నటుడిగా, దర్శకుడిగా అద్భుతమైన విజయాలు అందుకుంటున్నారు బాసిల్ జోసెఫ్. 2021లో మిన్నల్ మురళీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత జయ జయ జయ జయహే, సూక్ష్మదర్శిని, పోన్ మాన్ వంటి సినిమాలతో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాసిల్ జోసేఫ్ తెరకెక్కించిన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కేవలం మూడు సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన బాసిల్ ఇప్పుడు నేరుగా బన్నీతో సినిమా చేయనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ గట్టిగా నడుస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. నిజానికి కేరళలో బన్నీకి విపరీతమైన క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. మలయాళీ ప్రేక్షకులు బన్నీ ని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో వైరల్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ నెలకొంది. ఈ విషయంపై డైరెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.