పశ్చిమ బెంగాల్ లో బీజేపీ పార్టీకి ఊహించని విధంగా బిగ్ షాక్ తగిలింది. ఎంతో కష్టపడినప్పటికీ బీజేపీలో తనకు తగిన గుర్తింపు రావటంలేదని , చెత్త రాజకీయాల చూడలేకపోతున్నానంటూ ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మండల్ ఖాన్ సోమవారం నాడు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. బెంగాళ్‌లోని బిష్ణూపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన సౌమిత్రా ఖాన్ భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. కోల్‌కతాలో టీఎంసీ నాయకులు సౌగతా రాయ్, పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో సుజాతా ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎప్పటి నుంచో పార్టీకి విధేయంగా పని చేస్తున్న తమ లాంటి వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన అవినీతి పరులకు గుర్తింపు ఇస్తుండడంతో తాను పార్టీ మారానని ఆమె వివరించారు.
ఇప్పటికీ బీజేపీలో కొనసాగుతోన్న ఆమె భర్త గురించి ప్రశ్నించగా, అది ఆయన ఇష్టమని, ఏదోరోజున వాస్తవాలను గుర్తించి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినా చేరిపోవచ్చని ఆమె చెప్పారు. ఇదే విషయమై సౌమిత్రా ఖాన్‌ను ప్రశ్నించగా, సుజాతా ఖాన్ ఇలా చేయటం తనకి ఇష్టం లేదని , పార్టీ మారినందున తమ పదేళ్ల వివాహిక బంధాన్ని తెంపేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, త్వరలోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటానని చెప్పారు. ఇక ముందు తన భార్య తన ఇంటిపేరుని వాడుకోరాదని ఆయన చెప్పారు. ఇలాంటి సంఘటనతో పశ్చిమ బెంగాల్ లో రాజకీయం బాగా వేడెక్కింది.
ఇదిలా ఉంటె అంతకుముందు హోంమంత్రి అమిత్ షా శనివారం, ఆదివారం బెంగాల్ పర్యటనలో ఉన్నారు. మమతా బెనర్జీకి సన్నిహితుడైన మాజీ మంత్రి ‘శుభేందు అధికారి’ శనివారం అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. ఎంపి సునీల్ మండల్, మాజీ ఎంపి దాశ్రత్ తిర్కీ, 10 మంది ఎమ్మెల్యేలు కూడా బిజెపిలో చేరారు. వీరిలో 5 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ కు చెందినవారు. ఈ సందర్బంగా షా మాట్లాడుతూ… ఎన్నికలు నాటికి మమతా బెనర్జీ ఒంటరిగా పోరాడాలని అన్నారు .