ఈ కాలంలో పెళ్లి అంటే మామూలు హంగూ ఆర్భాటం కాదు. ప్రెస్టేజికి పోయి పైసలు లేకున్నా సరే అప్పులు చేసి మరీ ఘనంగా పెళ్లి చేసుకుంటారు. డప్పులు, మెరిసే లైట్లు, డ్రోన్ కెమెరాలు, ఎల్ ఈడీ టివిలలో లైవ్ కవరేజి, లక్షల రూపాయల బట్టలు, 100 రకాల వంటలు, కిలోల కొద్ది బంగారం, కార్ల అలంకరింపు… అసలు చెప్పరాదనుకోర్రి ఇగ… ఉన్నోల్ల సంగతి అయితే ఇక చెప్పకర్లేదు. మామూలుగా ఉండది వాళ్లు ఎవ్వారం. అది ఇక ఏ కలెక్టర్ కొడుకో అయితే ఇక ఎట్లుంటది. చెప్పకర్లేదు కదా.
కానీ ఓ కలెక్టర్ తన కొడుకు పెళ్లి కేవలం 36 వేల రూపాయల ఖర్చుతోనే చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆశ్చర్యం కాదు అసలు సాదాసీదాగా జీవించడం ఎలా ఉంటుందో చూపించాడు. ఇవాళ రేపు చిన్న వార్డు మెంబర్, సర్పంచ్ అయితేనే ఆగే కాలం లేదు.అటువంటిది ఓ కలెక్టర్ అతి సామాన్యంగా తన కొడుకు పెళ్లి చేశాడు.

పట్నాల బసంత్ కుమార్ ఐఏఎస్… ప్రస్తుతం ఆయన విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ది సంస్థకు కమిషనర్ గా ఉన్నారు. ఆయన కుమారుడే అభినయ్. అభినయ్ ప్రస్తుతం బెంగుళూరులో బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్నాడు. అతనికి ఎంబిబిఎస్ చేసిన లావణ్యతో వివాహం నిశ్చయం చేశారు. అయితే వీరి వివాహం హంగు ఆర్బాటం లేకుండా చేయాలని పెద్దలు నిర్ణయించారు. సత్సంగ్ అనే సంస్థలో బసంత్ కుమార్ సభ్యుడు. దాని ఆచారం ప్రకారం వారు సాధారణంగా జీవించాలి. ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. ఇటువంటి వివాహాలైనా వారే తక్కువ ఖర్చులతో నిరాండబరంగా జరిపేలా చూస్తారు.
లావణ్య అభినయ్ ల వివాహం కూడా అతి సాధారణంగా జరిగింది. ఆదివారం నాడు వారు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. నిరాండబరతే పందిరేసి… ఔన్నత్యమే పీటలేసి… సదుద్దేశం వరమాలై… సంతోషం తలంబ్రాలై వీరిద్దరు ఒక్కటయ్యారు. వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరి ఆదర్శ వివాహాన్ని అంతా అభినందించారు.
