కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే 98 శాతం మరణం ముప్పు తగ్గుతుందన్నది ఇటీవల జరిగిన పలు అధ్యయనాల సారాంశం. ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకుంటే 93 శాతం మేర రక్షణ కల్పిస్తుందట.. మరణం ముప్పు నుంచి. అదే, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే 98 శాతం మరన భయం లేనట్టే. వింటోంటే, కరోనా అంటేనే భయం తగ్గిపోతోంది కదూ.? అసలు కరోనా సోకినవారిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.? అన్న లెక్కలు తీయాల్సి వుంది మొదట.
దేశంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య.. తక్కువేమీ కాదు. అయితే, మరణాల రేటుని తీసుకుంటే.. అది 1 శాతానికి అటూ ఇటూగా వుంది. సాధారణ ఫ్లూ జ్వరాల్లోనూ మరణాల శాతం ఎక్కువే వుంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. వైరల్ జ్వరాల వల్ల 3 నుంచి 4 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలూ దేశంలో వున్నాయన్నది వైద్య నిపుణుల వాదన. ఆ లెక్కన కరోనా వైరస్ సోకినవారిలో మరణాల రేటు చాలా తక్కువనే భావించాలేమో.
కానీ, కరోనా వైరస్ సోకితే.. ఆక్సిజన్ అవసరం తలెత్తితే, అది చాలా భయంకరమైన పరిస్థితి. ఒక్కోసారి రోగి వారాల తరబడి, నెలల తరబడి ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందాల్సి రావడమో, లేదంటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక కూడా కొన్నాళ్ళపాటు ఆక్సిజన్ మీదనే వుండాల్సి రావడమో జరగొచ్చు. ఇది చాలా కొద్ది మందిలో జరిగే అవకాశం వుంటుంది. అదే అసలు సమస్య. వ్యాక్సిన్ వల్ల ఆ ముప్పు ఎంతవరకు తగ్గుతుంది.? అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం దొరకడంలేదు. లెక్కలు తీయడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు.?