2000 నోట్లపై కేంద్రం కీలక ప్రకటన… కొత్త డౌటు!

గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా 2000 రూపాయల నోట్లకు సంబధించి ఒక చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చిన కొత్తలో ఒకసారి పాతనోట్ల రద్దు కార్యక్రమాన్ని తలపెట్టిన మోడీ… ఇప్పుడు మరోసారి ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు అని, అందులో భాగంగా ముందుగా రెండువేల నోట్లను రద్దుచేయబోతున్నారని గతకొంతకాలంగా ఊహాగాణాలు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే బ్యాంకు ఏటీఎం లలో కూడా ఈ నోట్లు పెట్టడం లేదని గాసిప్స్ తెగ చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా రెండు వేల నోటుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

అవును… గతకొంతకాలంగా మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్న, “ఏటీఎం లలో రెండువేల నోట్లు అదృశ్యం” అనే అంశంపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అందులో భాగంగా… ఏటీఎంలలో రెండు వేల నోట్లు నింపడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, దానికి సంబంధించి బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో తాజాగా తెలియజేశారు.

రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదికల ప్రకారం.. 2017 మార్చి చివరి నాటికి 500, 2,000 నోట్ల మొత్తం విలువ 9.512 లక్షల కోట్లు అని.. అదే సంఖ్య 2022 మార్చి చివరి నాటికి 27.057 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. ఇంత భారీ మొత్తంలో రెండు వేల నోట్లు ఉన్నాయని చెప్పిన ఆమె… ఏటీఎంలలో ఈ రెండువేల నోట్లు నింపకూడదని బ్యాంకులకు ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పారు. తమ కస్టమర్ల అవసరాలకనుగునంగా బ్యాంకులు ఏటీఎంలలో నోట్లను నింపుతాయని వివరించారు.

ఇంతవరకూ బాగానే ఉంది.. ఇదంతా నిజమే కాబోలు అనుకునేలోపు మరికొన్ని సందేహాలు ఆన్ లైన్ వేదికగా చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. అవి ఏమిటంటే… దేశంలో 27లక్షల కోట్ల విలువ చేసే రెండువేల రూపాయల నోట్లు ఉంటే… ఆ నోట్ల సర్క్యులేషన్ ఎందుకు పూర్తిగా తగ్గిపోయినట్లు? పోనీ… గత కొన్నేళ్లుగా రిజర్వ్ బ్యాంకు కనీసం ఒక్క 2000 కరెన్సీ నోటును కూడా ప్రింట్ చేయలేదు అనుకుంటే… ఏటీఎంలలో ఈ నోట్లు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం అని నమ్మితే… అప్పటికే చలామణిలో ఉన్న 27లక్షల కోట్ల విలువైన రెండువేల నోట్లు ఏమయ్యాయి? ఇప్పుడు ఎక్కడున్నాయి? ఎన్నికల సమయంలో వెలుగులోకి వస్తాయేమో..?