Pawan Kalyan: తాజాగా తూర్పు గోదావరి జిల్లా పెరవలిలో పర్యటించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గంలో అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ క్రమంలో సీఎం.. సీఎం.. సీఎం నినాదాలు మాయామవ్వడం గమనార్హం. దీంతో పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనే ఆయన సామాజికవర్గ ప్రజానికం, కార్యకర్తలు, అభిమానుల కోరిక చచ్చిపోయిందా..?
15 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉండాలని చెబుతున్నారంటే.. తాను సీఎం అవ్వననో, తనకు సాధ్యం కాదనో, తనవల్ల కాదనో ఆయనే ఫిక్సైపోయినట్లేనా..?
తాను ఒంటరిగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలవలేను.. అది తెలియక కార్యకర్తలు సీఎం సీఎం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. వాస్తవాలు నాకే తెలుసు అని పవన్ భావిస్తున్నారా..?
కచ్చితంగా తమ సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ రాజ్యాధికారాన్ని దక్కించుకుంటారని ఆశిస్తూ, దక్కించుకోవాలని కోరుకుంటూ, సమయాన్ని, డబ్బుని వెచ్చించినవారి పరిస్థితి ఏమిటి..?
పవన్ కల్యాణ్ సంగతి పక్కనపెడితే… అసలు ఆ ఊసే అభిమానులు ఎందుకు ఎత్తలేదు..?
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా కూడా.. ఆయన జనాల్లోకి వస్తే.. కార్యకర్తలు, ఆయన సామజికవర్గానికి చెదినవారు, అభిమానులు.. “సీఎం.. సీఎం.. సీఎం” అంటూ నినాదాలు చేసేవారు. ఆ నినాదాలు ఒకోసారి పవన్ కే చికాకు తెప్పిచే స్థాయిలో ఉండేవి! మీరు ఓట్లు వేయకుండా సీఎం ఎలా అవుతానయ్యా అంటూ ఆయనే ఒక్కోసారి కడుపు చించుకున్న పరిస్థితి!

అయితే తాజాగా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో పవన్ సభలో రెగ్యులర్ గా వినిపించే అర్ధం లేని అరుపులు, సినిమా ఫంక్షన్స్ లో వినిపించే కేకలు వినిపించాయే తప్ప… సీఎం.. సీఎం అనే నినాదాలు మాత్రం మచ్చుకు వినిపించలేదనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది. దీంతో.. కొండ నాలుకకు మందేసి ఉన్న నాలుక ఊడగొట్టొద్దని ఆయనే.. కార్యకర్తలకు సూచనలు చేశారా అనే సందేహా ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది!
పైగా జనసైనికులు వేసిన కేకల విషయంలో ఆయన కాస్త అసహనం కూడా వ్యక్త చేశారు. ఇందులో భాగంగా… ఉత్సాహం మంచిదే కానీ, నియంత్రణ ముఖ్యమని.. ఇలా అరవడాలు, అల్లర్లు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని.. పైగా ఈ అల్లర్ల వల్ల తాను ఉన్న సభలకు రావడానికి ప్రధానమంత్రి సైతం ఇబ్బంది పడుతున్నారని.. ఆయన సెక్యూరిటీ సైతం ఇబ్బంది పడుతుందన్నట్లుగా పవన్ వ్యాఖ్యానించారు.. ఇలా అదేపనిగా చెప్పింది వినకుండా అరవడం వల్ల గొంతులు పోతాయని అన్నారు!
పైగా… మీరు ఎవరిని ఆరాధిస్తారో వారిలానే తయారవుతారని చెప్పిన పవన్ కల్యాణ్.. తాను పొట్టి శ్రీరాములుని ఆరాధించినట్లు తెలిపారు. తాను క్రిమినల్స్ ని, దోపిడీ చేసేవారిని, దగా చేసేవారిని ఆరాధించలేదని.. హక్కుల కోసం పోరాడేవారిని ఆరాధించానని అన్నారు. అయితే… ఆయన అభిమానులు, కార్యకర్తలు మాత్రం ఆయననే ఆరాధించారు కదా.. మరి వాళ్లు ఆయనలాగానే మారి, అలా కేకలు వేశారా అంటూ పలువురు అమాయకులు ఆన్ లైన్ వేదికగా ప్రశ్నిస్తున్నారు.
ఆ సంగతి అలా ఉంటే… సీఎం సీఎం అనే నినాదాలు లేకపోవడానికి కారణం… అత్యధిక జనాభా ఉన్న కాపు, దళిత, బీసీ వర్గాలు ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలనే చర్చ బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో.. కాపులు పవన్ కు ప్రత్యామ్నాయంగా మరొకరిని చూసుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఈ నెల 26న విశాఖలో జరిగే రంగనాడు సభ ఈ సందర్భంగా కీలకంగా మారిందని చెబుతున్నారు.
సో… ఇకపై పవన్ కల్యాణ్ సభలో “సీఎం.. సీఎం.. సీఎం” అనే నినాదాలు వినిపించవన్నమాట.. ఇది ఫిక్స్!!

