Purnam Kumar Shaw: పాక్ చెర నుంచి బయటపడిన జవాన్‌.. ఎలా ఇబ్బంది పెట్టారంటే..

పంజాబ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సమయంలో పొరపాటున పాకిస్థాన్ భూభాగంలోకి అడుగుపెట్టిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా చివరికి భారత గడ్డపైకి తిరిగొచ్చాడు. కానీ ఆయన చెరలో గడిపిన 21 రోజులు నరకయాతనగా మారాయి. పాక్ రేంజర్లు పట్టుకున్న తరువాత షాను కళ్లకు గంతులు కట్టి ఉంచడం, నిద్ర పట్టనీయకుండా వేధించడం, మానసికంగా హింసించడం వంటి అకృత్యాలు చేసినట్లు సమాచారం.

తీవ్ర వాదులకు రక్షణ ఇచ్చే పాక్, ఒక్క పొరపాటు చేసిన జవాన్‌పై ఇలా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పూర్ణం కుమార్‌ను పాక్ నుండి విడుదల చేయించేందుకు భారత్ అధికారులు నిరంతరం ప్రయత్నించారు. జూన్ 14న అటారి వేదికగా షాను అధికారికంగా అప్పగించారు. మూడు వారాల పాటు శారీరక, మానసికంగా తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న షా పరిస్థితిని భారత వైద్య బృందం పరిశీలిస్తోంది. షా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, ఆయన అనుభవించిన దుస్థితి దేశ వ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది.

ఈ ఘటనపై భద్రతా వర్గాలు త్వరలోనే విచారణ చేపట్టనున్నాయి. షా ఎలా పొరపాటున సరిహద్దు దాటి వెళ్లాడన్న విషయంపై స్పష్టత రానుంది. అయితే సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లు ఎదుర్కొంటున్న ముప్పు, పాకిస్థాన్ వైఖరి మరోసారి బయటపడిన ఈ ఘటన, భారత్‌–పాక్ మధ్య స్థిరత్వం అనే పదాన్ని ప్రశ్నార్థకంగా మార్చుతోంది. మానవ హక్కుల పేరుతో నినాదాలు చేసే పాక్, ఓ జవాన్‌ను ఇలా చిత్రహింసలకు గురిచేయడం శోచనీయం.