బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ నుంచి వచ్చే అన్ని రకాల విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నెల 22వ తేదీ రాత్రి 11.59 గంటల నుంచి డిసెంబర్ 31 రాత్రి 11.59 గంటల వరకు యూకే నుంచి వచ్చే విమానాలకు అనుమతి లేదు అని కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది.
ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, కెనడా, ఇటలీ, ఆస్ట్రియా వంటి దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలను నిషేధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూకే నుంచి వస్తున్న విమానాల్లో ఉన్న ప్రయాణికులకు ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ను తప్పనిసరి చేసినట్లు కూడా విమానయాన శాఖ వెల్లడించింది.
ఇప్పటికే యూకే నుంచి బయలుదేరిన విమానాలు లేదా డిసెంబర్ 22, రాత్రి 11.59 గంటలలోపు వచ్చే విమానాల్లో ప్రయాణికులకు ఈ టెస్ట్‌ను తప్పనిసరి చేశారు. యూకేలో వ్యాప్తి చెందుతున్న కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త రకం కరోనా వైరస్ 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు