ఐదు దశల లోక్ సభ ఎన్నికలయిన తర్వాత భారతీయ జనతా పార్టీ మాటల తీరులో మార్పు కనిపిస్తూ ఉంది. 2014 నాటి అఖండ విజయం ధీమా లేదు. అది కూడా ఎపుడు, దాదాపు ప్రధాని మోదీ 125 రోజుల పాటు దేశమంతా తిరిగి దాదాపు 200 సమావేశాలలో ప్రసంగించి వచ్చాక.
భారతీయ జనతా పార్టీకి స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ వస్తుందనే విషయంలో పార్టీ నేతల్లో సంపూర్ణ విశ్వాసం లేదు. అయితే, ఎన్ డి ఎ భాగస్వామ్య పార్టీలతో కలసి హాయిగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని మాత్రం చెబుతున్నారు.
ఈ విషయం చెప్పిందెవరో కాదు, పార్టీ లో ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధి గా ఉంటున్న ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్.
ఆయన బ్లూమ్ బర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యలో అనేక ఆసక్తికరమయిన విషయాలను వెల్లడించారు. మోదీ సాధించిన ఘనవిజయాల జాబితా వల్లెవేసినా, రామ్ మాధవ్ మాటలో 2014 నాటి ధీమా, ఆత్మ విశ్వాసం కనిపించకపోవడం ఇంటర్వ్యూ విశేషం.
‘ఈ ఎన్నికల్లో మాకు 271 స్థానాలు (సింపుల్ మెజారిటీ) చాలా సంతోషిస్తాం.అయితే, ఎన్ డి ఎ మిత్ర పక్షాలతో కలసి మాత్రం హాయిగా మెజారిటీ సాధిస్తాం,’ (If we get 271 seats on our own, we will be very happy,with NDA we will have a comfortable majority”) అని బ్లూమ్ బర్గ్ చీఫ్ ఎడిటర్ జాన్ మిక్లెత్ వెయిట్ కు చెప్పారు.
రామ్ మాధవ్ 271 సీట్ల పరిమితి గీసుకోవడం ఆశ్చర్యం.
ఇతర బిజెపి నేతులు చెబుతున్న సంఖ్య కంటే ఇది చాలా చాలా తక్కువ. ఎన్నికలు పూర్తికాబోతున్నాయి. ప్రధాని ఉధృతంగా ప్రచారం చేశారు. ఇలాంటపుడు పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందనే ఆశ బలహీనంగా ఉండటం ఆశ్చర్యం అని బ్లూమ్ బర్గ్ వ్యాఖ్యానించింది.
ఎందుకంటే, మోదీని పార్టీ నేతలు మహాబలవంతుడిగా చూపిస్తున్నారు. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పిన నేత గా వర్ణిస్తున్నారు. భారత దేశాన్ని ప్రపంచంలో ఒక శక్తిగా తీర్చిదిద్దిననాయకుడిగా ప్రచారం చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా 1947 నుంచి వచ్చిన చరిత్రను కాదని కొత్త చరిత్ర రాస్తున్న నేతగా కీర్తిస్తున్నారు.దానికితోడు ఇపుడు పుల్వామా, బాలకోట్, సర్జికల్ స్ట్రయిక్ వంటి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అయినా సరే మోదీకి 271 సీట్లు వస్తే బాగుంటుందని ఒక ప్రముఖ నేత అనుమానాస్పదంగా చెప్పడం ఆశ్చర్యం.
ఉత్తర భారత దేశంలో 2014 లో వచ్చిన మెజారిటీ ఈసారి రాకపోవచ్చని , అయితే, ఈ నష్టం ఈశాన్య రాష్ట్రాలతో పాటు బెంగాల్ , ఒడిషాలలో ఎక్కువ సాధించి పూరించుకుంటామని ఆయన అన్నారు.
‘రాజకీయ నాయకులుగా మనం ఒకటి విషయం గుర్తుంచుకోవాలి. గత ఎన్నికల్లో సాధించింది, ప్రభుత్వ వ్యతిరేక వల్ల ఈ సారి సాధించలేకపోవచ్చు,’( “As politicians, we must remember that what we achieved last time, we may not repeat because of anti-incumbency”)అని రామ్ మాధవ్ చెప్పడం విశేషం.