సోము వీర్రాజు.. గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఈయన కూడా ఒక హాట్ టాపిక్ అయ్యారు. బీజేపీ ఏపీ శాఖకు ఈయన్ను అధ్యక్షుడిని చేసింది. ఉన్నపళంగా ఈయన నియామకం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష పదవుల విషయంలో బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటుంది. ఎంతో నమ్మకమైన వ్యక్తులకే అధ్యక్ష బాద్యతలు అప్పగిస్తుంది. అందుకే సోము వీర్రాజు వార్తల్లో నిలిచారు. ఇక అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న క్షణం నుండి సోము వీర్రాజుగారు పూర్తి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రతి విషయంలోనూ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అమరావతి విషయంలో బీజేపీ స్టాండ్ ఏమిటో అర్థంకాని చాలామందికి సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. అమరావతి రైతుల తరపున పోరాడతాం కానీ రాజధాని కేంద్రం పరిధిలో లేదంటూ తేల్చేశారు.
ఇక తనకు అధికారం ఇస్తే ప్రతి జిల్లాను రాజధానిగా మారుస్తాం, పవన్ నాయకత్వంలో మోదీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళతాం, టీడీపీ, వైసీపీ అనే రెండు కళ్లను పిడిచేసి తాము మూడో కన్ను తెరుస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ లతో సమావేశాలు జరిపారు. పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని సస్పెండ్ చేసి హాట్ టాపిక్ అయ్యారు. ఇక నిన్న జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో కూడా అలాగే మాట్లాడారు. 2024 నాటికి బీజేపీ అధికారంలోకి వస్తుందని, తీసుకురావడమే లక్ష్యమని వేదిక మీద నుండి పిలుపునిచ్చారు. ఈ పిలుపు అంత ఉత్సాహం కోసమే తప్ప నెరవేరెది కాదని అందరికీ తెలుసు. అందుకే జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నేల విడిచి సాము చేయవద్దనే రీతిలో సోము వీర్రాజుకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో అధికారంలోకి రావడం అంత సులభం కాదని రామ్ మాధవ్ అనడంతో అప్పటివరకు సోము వీర్రాజు చేసిన 2024లో అధికారం మనదే అనే వ్యాఖ్యలకు విలువ లేకుండా పోయింది. అంతేకాదు ముందుగా ప్రతిపక్ష హోదా మీద దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. తెలుగుదేశం పని అయిపోయిందని, ఏపీలో ఆ పార్టీ లేదని అన్న రామ్ మాధవ్ ముందుగా శూన్యతను బీజేపీ కవర్ చేసేలా పని చేయాలని అన్నారు. ఆయన మాటల్లో సాధ్యంకాని అధికార పార్టీ హోదా తర్వాత ముందు ప్రతిపక్ష హోదా దక్కేలా పనిచేయండనే అర్థం ధ్వనించింది. దీంతో సోము వీర్రాజు దూకుడుకు స్పీడ్ బ్రేకర్ పద్దట్టైంది. చాలామంది పార్టీ వ్యక్తులు రామ్ మాధవ్ మాటల్లో నిజం లేకపోలేదు. లేని పోని గొప్పలైందుకు అంటూ గుసగులాడుకుంటున్నారు.