తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలనే కోరిక బీజేపీలో బలంగా ఉంది. అందుకే తెలుగు రాజకీయాలు మీద ఎక్కువ సమయ కేటాయిస్తోంది అధినాయకత్వం. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నాయకులను సిద్ధం చేసుకుంటున్నారు. అయిత్రే ఈ ప్రక్రియలో బీజేపీ గురి ఆంధ్రప్రదేశ్ మీదకంటే తెలంగాణా మీద గట్టిగా ఉన్నట్టు అనిపిస్తోంది. గత ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ బలపడిందన్న విషయం స్పష్టంగా అర్థమైంది. నాలుగు లోక్ సభ స్థానాల్లో గెలిచి తెరాసకి షాకిచ్చింది బీజేపీ. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపురావులు విజయం సాధించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఎక్కువగా దృష్టి పెడితే అధికారానికి దగ్గరకావొచ్చని భావించింది.
అందుకే కిషన్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి పదవిని కట్టబెట్టి సంచనలం రేపింది. ఈ పరిణామంతో తెలంగాణలో ఆ పార్టీ క్రమంగా బలపడుతూ వస్తోంది. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గతంకంటే మెరుగైన ఫలితాలను రాబడుతుందని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు. ఇంకొన్నాళ్లలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని బీజేపీ వెనక్కు నెట్టి తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలబడినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇలా తెలంగాణలో దూసుకుపోతున్న కమల దళం ఏపీలో మాత్రం నత్తనడకనే సాగుతోంది. కేవలం పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించడం, పురందేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి, సత్యకుమార్ కు జాతీయ కార్యదర్శి పదవి ఇవ్వడం మినహా చెప్పుకోదగిన రీతిలో వేరే ఏమీ చేయలేదు.
ప్రధానంగా ఆంధ్రా నుండి కూడ కేంద్ర కేబినెట్లో నేతలు ఉంటే ఆ ప్రభావమే వేరుగా ఉంటుందని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. త్వరలో మోడీ కేబినెట్ వివిస్తరణ జరగనుంది. అందులోనైనా ఏపీ నుండి ఒకరిద్దరికి ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు. అమిత్ షా మదిలో రామ్ మాధవ్, ఏపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సురేష్ ప్రభు లాంటి వారి పేర్లు ఉన్నాయని, వారిలో ఒకరికి పదవి ఖాయమని అంటున్నా ఆ మాటలు బీజేపీ వర్గాల వరకే పరిమితమయ్యాయి. ఒకవేళ వీరిలో ఎవరో ఒకరికి పదవి ఇచ్చినా వారిని ఏపీలో కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పనిచేయించుకునే అవకాశం కూడ ఉంది. అదే జరిగితే వారికి పదవులు ఇచ్చి కూడ ఏపీ బీజేపీ లాభపడేదేమీ ఉండదు. ఈ వ్యవహారం చూస్తుంటే ఏపీలో పుంజుకోవడం మీద అధినాయకత్వానికి పెద్దగా ఆశలు, నమ్మకాలు లేవని, అందుకే ఈ నాన్చుడు ధోరణి అని అనుకుంటున్నారు.