ఎన్డీయే కూటమి సమావేశం జరగబోతోంది. కూటమిలో వున్న పార్టీలకు ఆహ్వానాలు వెళుతున్నాయట కూడా.! చిత్రంగా తెలుగుదేశం పార్టీకి కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఆహ్వానం పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అదేంటీ, 2019 ఎన్నికలకు ముందర కదా, ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది.! అది, 2018 నాటి కథ. ఇప్పుడేమో, బీజేపీతో కలిసి నడిచేందుకు మళ్ళీ చంద్రబాబు ఆపసోపాలు పడుతున్నారు. చంద్రబాబుని కలుపుకుపోవడానికి బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది.
ఏపీ బీజేపీ నేతలేమో, టీడీపీని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం, టీడీపీ మీదకు వలపు బాణాలు సంధిస్తోంది. ఎన్డీయే కూటమిలోకి టీడీపీని ఆహ్వానిస్తున్నట్టుగా లీకులు పంపిందే బీజేపీ.. అన్న వాదన లేకపోలేదు.
అధికారిక ప్రకటన రాగానే, ఎన్డీయే కూటమి వెళ్ళాలనే ఉత్సాహంతో వున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ఈ మేరకు ఓ బృందాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నారట. కానీ, ఇంతలోనే బాంబు పేలింది. బీజేపీ నేత మాధవ్, ‘ఎన్డీయే కూటమిలోకి టీడీపీని ఆహ్వానించలేదు.. ఆ సమావేశానికి టీడీపీని పిలవలేదు’ అని తేల్చేశారు.
ఇలా మాధవ్ నుంచి ప్రకటన వస్తుందనే సమాచారం ముందుగానే అందుకున్న టీడీపీ, తాము ఎన్డీయే కూటమి సమావేశానికి వెళ్ళడంలేదని ప్రకటించేయడం గమనార్హమిక్కడ. టీడీపీ నెట్‌వర్క్ అలాంటిది మరి.! ప్రస్తుతం టీడీపీ – బీజేపీ మధ్య పొత్తుల చర్చలు ప్రాథమిక దశలో వున్నాయి. పైగా, ఇది జనసేనాని బలవంతం మీద నడుస్తున్న పొత్తుల చర్చల వ్యవహారమాయె.
బీజేపీ – టీడీపీ దోబూచులాట వ్యవహారం, జనసేన పార్టీకి కూడా ఇరిటేషన్ తెప్పిస్తోంది. అదేంటో, బీజేపీ మిత్రపక్షమైన జనసేనకు సైతం ఎన్డీయే కూటమి సమావేశాలకు ఆహ్వానం అందలేదట.!