దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న భారత్ బంద్

అడ్డు అదుపు లేకుండా రికార్డు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ డిజీల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన  భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర పార్టీల నేతలు బంద్ లో పాల్గొన్నారు.

రాంలీలా మైదానంలో బంద్ లో పాల్గొని నిరసన తెలుపుతున్న నేతలు

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బంద్ కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బంద్ కొనసాగుతోంది. నాయకులు రోడ్లపై బైఠాయించడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ధరల పెంపుపై నిరసన ప్రదర్శనలు చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో ఎల్ జేడీ కార్యకర్తలు రైల్వే ట్రాక్ పైకి చేరి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుజరాత్ లోనూ బంద్ కొనసాగుతోంది. ధరల  పెంపుకు నిరసనగా ప్రతిపక్ష పార్టీల నాయకులు రోడ్లపైకి చేరి బస్సులను అడ్డుకున్నారు.

బంద్ నేపథ్యంలో ముంబాయి లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల కార్యకర్తలు పెట్రోల్ బంక్ ల వద్దకు వెళ్లి వాటిని మూయించారు. బంద్ దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు 21 విపక్ష పార్టీలు, స్వచ్చంధ సంస్థలు, పౌర  సమాజ ప్రతినిధులు ఈ బంద్ లో పాల్గొన్నారు.