ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు డిల్లీలో ధర్మపోరాట దీక్షకు దిగారు. ఏపీ భవన్ వేదికగా ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ భవన్ వేదికగా దీక్ష చేసిన బాబు ఆ తర్వాత ఇప్పుడు మరోసారి దీక్షకు దిగారు.
ఎన్డీయే మధ్యంతర బడ్జెట్ లో ఏపీకి మొండి చేయి చూపడంతో ఢిల్లీ వేదికగా చంద్రబాబు దీక్షకు దిగారు. నల్ల చొక్కాతో చంద్రబాబు దీక్షకు హాజరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, నిధుల కేటాయింపు, రాజధాని నిర్మాణానికి సహాయం ఇటువంటి అన్ని విషయాలలో కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందని చంద్రబాబు అన్నారు.
దీక్షకు దిగడానికి ముందు బాబు రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఏపీ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. దీక్షా వేదికపై గాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు.
ఢిల్లీ ధర్మ పోరాట దీక్షలో చంద్రబాబు ఏమన్నారంటే
“ప్రధాన మంత్రి మన హక్కులు కాలరాస్తే ఊరుకునేది లేదు. ఖబర్దార్ ప్రధాన మంత్రి జాగ్రత్త. ఈ రోజు మనం చేస్తున్న ధర్మపోరాటం ఐదు కోట్ల ప్రజల కోసం చేస్తున్న విషయం. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదు. న్యాయం చేయమంటే వ్యక్తిగత విమర్శలు చేస్తారా. కేంద్రం ఏపికి అడుగడుగునా ఇబ్బంది పెట్టింది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారు. పోలవరానికి అన్యాయం చేశారు. పదేళ్లు హోదా ఇవ్వాలని అప్పుడు అన్నారు. కానీ ఇప్పుడు మాట తప్పి ప్రవర్తించారు.
పోలవరం డీపిఆర్ ఇప్పటి వరకు అంగీకరించలేదు. రాజధాని నిర్మాణానికి 1500 కోట్లు ఇచ్చారు. భిక్షమెసినట్టు వేస్తే రాజధానిని ఎలా నిర్మించుకుంటాం. మోదీ నీ దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. మీ ఆటలిక సాగవు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగింది. ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్షతో మా సత్తా చూపడానికి వచ్చాం. లెక్కలు చెప్పండని మోదీ అడుగుతున్నారు. మేము పన్నులు కడుతున్నాం. మరి మా లెక్కలు చెప్పడానికి మీరు సిద్దంగా ఉన్నారా అని అడుగుతున్నాను. మోదీకి పాలించే హక్కు లేదు. అతను పనికిరాడు. కొందరి చేతుల్లో కీలు బొమ్మగా మారాడు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే వారికి పరిపాలించే హక్కు లేదు. అధికారం నెత్తిన పెట్టుకొని విర్రవీగితే ప్రజలు ఊరుకోరు.” అని చంద్రబాబు అన్నారు.