Shubhanshu Shukla: భారతీయ వ్యోమగామిగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు శుభాంశు శుక్లా చేసిన ప్రయత్నానికి మళ్లీ అడ్డంకి ఏర్పడింది. యాక్సియం-4 మిషన్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరాల్సిన ఆయన ప్రయాణం వాయిదా పడింది. అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా జూన్ 10న రోదసీలోకి ప్రయాణించాల్సి ఉండగా, అనూహ్య వాతావరణం వల్ల ప్రణాళికను బుధవారానికి మారుస్తూ ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్‌గా కీలక పాత్ర పోషించనున్నాడు. ఆయనతో పాటు పెగ్గీ విట్సన్, హంగేరీకి చెందిన టిబర్ కపు, పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ అనే వ్యోమగాములు కూడా అంతరిక్షానికి వెళ్లనున్నారు. ప్రయాణం కోసం అన్ని సాంకేతిక ఏర్పాట్లు పూర్తైనప్పటికీ, ప్రకృతి సహకరించక పోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. జూన్ 10న వాయిదా పడిన ఈ ప్రయోగం బుధవారం జరగనుంది. అయితే ఆ రోజూ వాతావరణం అనుకూలించకపోతే, జూన్ 11వ తేదీ మరో బ్యాకప్ డేట్‌గా సిద్ధం చేసినట్లు స్పేస్‌ఎక్స్ సంస్థ ముందుగానే ప్రకటించింది.
వాస్తవానికి ఈ మిషన్ మే 29న జరగాల్సి ఉండగా, జూన్ 8కు వాయిదా వేసి, అక్కడి నుంచి మళ్లీ జూన్ 10కు తరలించారు. తాజా వాయిదాతో ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. ఇది రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడి ప్రయాణం కావడం విశేషం. 1984లో సోయుజ్ వాహనంలో రాకేశ్ శర్మ అంతరిక్షానికి వెళ్లగా, అనంతరం భారత్ నుంచి ఇంత ప్రతిష్టాత్మక యాత్ర జరగడం ఇదే తొలిసారి.
ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. శుభాంశు శుక్లా ద్వారా మరోసారి భారత పౌరుడు రోదసిని తాకనున్నాడన్న గర్వం ప్రజల్లో కన్పిస్తుంది. వాతావరణం అనుకూలిస్తే బుధవారం మానవుడు, అది కూడా భారతీయుడే అంతరిక్షంలో అడుగుపెట్టనున్న తీరు చూసేందుకు ప్రపంచం ఎదురు చూస్తోంది.